Site icon Prime9

Pakistan wheat flour: పాకిస్తాన్‌లో మనిషి ప్రాణం, పరువు కంటే గోధుమ పిండి విలువైనదా?

Pakistan wheat flour

Pakistan wheat flour

Pakistan wheat flour:పాకిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడికి రెండు పూటల కడుపు నిండడం గగనం మారిపోయింది. పేదల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ప్రాణం కంటే గోధుమ పిండి ఖరీదైన వ్యవహారంగా మారడం నిజంగానే శోచనీయం. ఉచిత గోధుమ పిండి అది కూడా అత్యంత నాసిరకం పిండి ప్రజలకు ఇస్తున్నారు. పశువులకు మేతగా వేసే పిండి మాకు పంచుతున్నారని సామాన్యుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ ఉచిత పిండి కోసం ప్రాణాలు పొగొట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

10 కేజీల గోధుమపిండి కోసం కిలోమీటర్ల క్యూలు..(Pakistan wheat flour)

పాక్‌ చరిత్రలో మొదటిసారి ఉచిత గోధుమ పిండి కోసం ప్రజలు ఎగబడ్డం చూస్తుంటే దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతోంది. వేలాది మంది ముఖ్యంగా మహిళలు కిలోమీటర్ల పొడువాటి క్యూ లైన్లలో కేవలం పది కిలోల గోధమ పిండి కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. రంజాన్‌ కంటే ముందు ఈ పది కిలోల బ్యాగ్‌ ధర 1,156 రూపాయలు. దీనికి కోసం మహిళలు కూడా ప్రాణాలకు తెగిస్తున్నారంటే నిజంగా పాలకులకు సిగ్గుచేటని చెప్పుకోవాలి. ఉచిత గోధుమ పిండి పంపిణీ సెంటర్‌ల వద్ద పోలీసులు, జిల్లా అధికారులు వరదలా వచ్చే జనాలను కంట్రోల్‌ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయినా ప్రజలు ప్రాణాలకు తెగించి గోధుమ పిండి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద రణరంగమే చూస్తున్నామని లాహోర్‌కు చెందిన మిల్లర్‌ మాజిద్‌ అబ్దుల్‌ చెప్పారు. ఉచిత గోధుమ పిండి స్కీ కేవలం ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉంటుంది. కాగా పేదరికమనేది మాత్రం శాశ్వతం. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎంత వీలైతే అంత దక్కించుకోవాలని పేదవాడు ప్రయత్నిస్తున్నాడు.

తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు..

అయితే బెనజీర్‌ ఇన్‌కం సపోర్ట్‌ ప్రోగ్రాం (బీఐఎస్‌పీ) స్కీం కింద రిజిష్టర్‌ చేసుకున్నవారికి మాత్రం కొంత ఆలస్యం అయినా గోధుమ పిండి బ్యాగ్‌ ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరైతే రిజిస్ర్టేషన్‌ చేసుకోలేదో వారితోనే వస్తోంది చిక్కంతా. వీరు పంపిణీ కేంద్రం వద్ద అలజడి సృష్టించి .. అక్కడ గందరగోళం ఏర్పడిన వెంటనే గోధుమ బ్యాగ్‌లను తీసుకుని ఉడాయిస్తున్నారు. అయితే సోషలాజిస్టుల వాదన మరోలా ఉంది. ఉచిత పంపిణీ కేంద్రం వద్ద వేలాది మంది గంటల కొద్ద క్యూ నిల్చుంటున్నారు. తన పరువు, సామాజిక గౌరవాన్ని కూడా పక్కన పెట్టి హింసకు దిగుతున్నారు. ఈ గొడవల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా పంపిణి వద్ద జనాలు తగ్గుతున్నారా అంటే ఏమీ లేదు. ఈ సీన్‌లు కేవలం ఒక్క రాష్ట్రానికి పరిమితం కావడం లేదు. దేశంలోని అన్నీ ప్రావిన్స్‌లలో రోజు జరిగే తంతు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇది రాజకీయంగా, సామాజికంగా దేశానికి ముప్పు కలిగించే అంశం. ప్రభుత్వం గౌరవ ప్రదంగా పేద ప్రజలకు వారి ఇంటి వద్ద బ్యాగ్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ప్రజలకు.. ప్రభుత్వానికి మంచిదని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

దేశంలో పెరిగిన పేదరికం..

దేశంలో పేదరికం ఉందని తెలుసు . కానీ ప్రస్తుతం ప్రజలు ఉచిత గోధుమ పిండి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పరిస్థితిని చూస్తే దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని తెలుస్తోందని పాకిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన నాయకుడు పారూఖ్‌ తారిఖ్‌ చెప్పారు. కాగా పంజాబ్‌ ప్రభుత్వం చెబుతున్నంది ఏమిటంటే ఇప్పటి వరకు 30 లక్షల బ్యాగ్‌ల ఉచిత గోధుమ పిండిని పంపిణి చేశామని చెబుతోంది. అయినా రోజు రోజుకు క్యూలైన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గిన దాఖల్లాల్లేవు. అయితే వీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు. తమలాంటి వాళ్లం ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు దేశంలో పేదరికం పెరిగిపోతోందని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించున్న నాధుడే లేడని ఫారూఖ్‌ అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే పరిస్థితి చేజారిపోతుంది ఒకరిని ఒకరు దోచుకునే స్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు.

పేదలు, వయసు పైబడిన వారు బలహీనులు, మహిళలు అతి భయంకరమైన రిస్క్‌ తీసుకుంటున్నారు. గోధుమపిండి ట్రక్కురాగనే ముసలి ముతక, ఆడ, మగ, పిల్లా, జల్లా అనే తేడా లేకుండా ట్రక్కు వెంట పరుగులు తీస్తున్నారు. ట్రక్కు నుంచి బ్యాగ్‌లను విసిరేస్తుండటంతో ఆ బ్యాగ్‌ దక్కించుకోవడానికి ఒకరి నొకరు తోసుకోవడం కొట్టుకోవడం .. రక్తాలు కారడం లాంటివి జరుగుతున్నాయి. ఈ స్కీం ద్వారా పీఎంల్‌-ఎన్‌ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని మాజీ ప్లానింగ్‌ డివిజన్‌కు చెందిన ఓ అధికారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓ చిన్న సంఘటన జరిగితే మీడియా గోరంతలు కొండంతలు చేసి చూపిస్తోంది. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ప్రజలను మరింత బికారీలు తయారు చేయాలని కంకణం కట్టుకున్నట్లుందని మేధావులు మండిపడుతున్నారు.ప్రస్తుతం పరిస్థితి మాత్రం చేజారిపోతోంది.. రంజాన్‌ సీజన్‌ ముగిసే లోగా ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో తెలియదు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం నిజంగానే శోచనీయం.

Exit mobile version