G7 Summit: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమావేశమయ్యారు. 2022, ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడుల తర్వాత ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. భేటీ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు.
జో బైడెన్ తో భేటీ
కాగా, జపాన్ లోని హిరోషిమా లో జీ7 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిశారు. ఉక్రెయిన్- రష్యా వివాదంపై మోదీ, జెలెన్ స్కీలు ఇప్పటికే పలు మార్లు ఫోన్ లో, వర్చువల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే.
మరోవైపు జీ7 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ తదితరులతో సమావేశమయ్యారు. ఫ్రాన్స్, జపాన్ దేశాల అధినేతలతో చర్చలు జరిపారు.
రష్యా వైఖరిని ఖండించిన జీ7 సభ్య దేశాలు (G7 Summit)
కాగా, ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య 15 నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులు పాల్గొనేందుకు వచ్చారు. రష్యా దాడులు మొదలైన తర్వాత జెలెన్ స్కీ పర్యటిస్తున్న తొలి ఆసియా దేశం జపాన్. ఈ సందర్భంగా ఆయన జీ7 దేశాల ప్రతినిధులతో పాటు ఇతర ఆహ్వానిత దేశాల నేతలతో భేటీ అవ్వనున్నారు. ఉక్రెయిన్ – రష్యా వివాదంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
మరో వైపు జీ7 సదస్సులో భాగంగా ఉక్రెయిన్ పై సభ్య దేశాలు ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి. ‘ ఉక్రెయిన్ పై రష్యా చేపడుతోన్న చట్ట విరుద్ధ, అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలనే జీ7 దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఐక్యరాజ్య సమితి చార్టర్ ను ఉల్లంఘిస్తోన్న రష్యా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రయత్నాలు అన్నింటినీ సమీకరించి, ఉక్రెయిన్ తో కలిసి పని చేస్తామని శాంతికి చిహ్నం అయిన హిరోషిమా వేదికగా ప్రతిజ్హ చేస్తున్నాం. త్వరగా ఉక్రెయిన్ శాంతిస్థాపన దిశగా సహకరిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి.