France : లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 26 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఫ్రెంచ్ ఫార్మసీలలో కండోమ్‌లు ఉచితంగా అందిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాదు మహిళలందరికీ గర్బనిరోధకమాత్రలను ఉచితంగా అందజేస్తారు. యువతలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్నాయని మాక్రాన్ అన్నారు.
లైంగిక విద్య విషయంలో ఫ్రాన్స్ మెరుగ్గా పనిచేయడం లేదని అధ్యక్షుడు మాక్రాన్ అంగీకరించారు. థియరీ కంటే రియాల్టీ ఎంతో దూరంలో ఉందని, ఈ విషయంలో ముందుగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగికపరమైన సాంక్రమిక వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 30 శాతానికి పెరిగింది. ఈ వ్యాధుల నివారణతో పాటు జనాభా నియంత్రణలో కూడా తన ప్రభుత్వ నిర్ణయం ఒక చిన్న విప్లవంలా పనిచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యానించారు.
ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఎస్టీడీ స్క్రీనింగ్ కేంద్రాలు మరియు కొన్ని పాఠశాల ఆరోగ్య కేంద్రాలలో కండోమ్‌లు ఇప్పటికే ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 26 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఫ్రెంచ్ పౌరులు డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్‌తో కండోమ్ కొనుగోళ్లకు చెల్లించవలసి ఉంటుంది.