France: విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్-స్టే స్కెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను ఫ్రాన్స్ రూపొందించింది.
ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల్లో భాగంగానే ఫ్రాన్స్ ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాషతో సహా ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్ధపడిందని రాయభార కార్యాలయం తెలిపింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రెసిడెంట్ మాక్రాన్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ మంచి స్నేహితునిలా పనిచేస్తుంది.’అని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు.ఫ్రాన్స్ విద్యావకాశాలు విద్యార్థులకు పరిచయం చేసేలా చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. అక్టోబర్‌లో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 40 ఇన్‌స్టిట్యూషన్‌లకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఫ్రెంచ్ వీసా దరఖాస్తు ఫారమ్: దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, ఆపై దాన్ని ప్రింట్ చేసి చివరలో సంతకం చేయాలి.
చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్: మీ పాస్‌పోర్ట్ 10 సంవత్సరాల కంటే పాతది కాదని మరియు ఫ్రాన్స్ మరియు మొత్తం స్కెంజెన్ భూభాగం నుండి మీరు అనుకున్న నిష్క్రమణ తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటును కలిగి ఉందని నిర్ధారించుకోవాలి.
ఫ్రాన్స్, స్కెంజెన్ ప్రాంతం లేదా ఏదైనా ఇతర దేశానికి వీసాను కలిగి ఉంటే, ఈ వీసాల కాపీలను సబ్మిట్ చేయాలి.
మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ మరియు అన్ని స్కెంజెన్ దేశాలకు చెల్లుబాటు అయ్యే ప్రయాణ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి బీమా ఈ జోన్‌లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను కవర్ చేయాలి, కనీస కవరేజీ 30000 యూరోలు ఉండాలి.
ఫ్రాన్స్‌లో ఉండాలనుకున్న మొత్తం వ్యవధికి వసతికి సంబంధించిన రుజువును సబ్మిట్ చేయాలి
ఫ్రాన్స్‌లో ఉన్న కాలానికి అవసరమైన ఆర్థిక వనరులను కలిగి ఉన్నారన్న ధ్రువపత్రాలను సబ్మిట్ చేయాలి.