Site icon Prime9

British passports: బ్రిటన్ పాస్ పోర్టుల చెల్లుబాటుపై అనుమానాలు

Doubts on the validity of British passports

British passports: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్‌పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్‌ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్‌పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్‌ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా… ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కల్పించాలి’’అని రాసి ఉంటుంది.

అయితే ఇప్పుడు రాణి మరణం నేపథ్యంలో తమ పాస్‌పోర్టులు ఇంకా చెల్లుతాయా లేక వాటిని మార్చుకోవాలా? అని బ్రిటన్‌కు చెందిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పాస్‌పోర్టులను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. గడువు ముగిసిన పాస్‌పోర్టులను పునరుద్ధరించుకొనేటప్పుడు రాజు చార్లెస్‌–3 పేరును అందులో చేరుస్తామని అధికార వర్గాలు ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాణి ఎలిజబెత్‌–2కు మాత్రం పాస్‌పోర్టు లేదు. ఎందుకంటే.. తన పేరిటే పాస్‌పోర్టులు జారీ అవుతున్నందున తాను కూడా పాస్‌పోర్టు కలిగి ఉండటం అర్థరహితమని ఎలిజబెత్‌–2 భావించారట.

అయితే ఆమె మినహా బ్రిటన్‌ రాజకుటుంబంలోని ప్రతి ఒక్కరికీ.. అంటే దివంగత భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సహా అందరికీ పాస్‌పోర్టు ఉండేది. ఆమె మరణం నేపథ్యంలో పాస్‌పోర్టులనే కాదు.. దేశ కరెన్సీ, స్టాంపులపై ‘రాణి’అనే పదం బదులు రాజు అనే పదాన్ని చేర్చాల్సి ఉంది. అలాగే యూకే జాతీయ గీతం ‘గాడ్‌ సేవ్‌ ద క్వీన్‌’ను ‘గాడ్‌ సేవ్‌ ద కింగ్‌’గా మార్చాల్సి ఉంది.

Exit mobile version