Donald Trump warning to hamas: తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బంధీలను విడిచిపెట్టాలని అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌ను హెచ్చరించారు. అలా జరగని పక్షంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
చెప్పింది చేయండి..
తాజాగా ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 20న తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నానని, ఈ లోగా హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలని, లేకుంటే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఆ హింస ఉంటుందని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన వాటి గురించి తాను మాట్లాడాలని అనుకోవటం లేదని, గతాన్ని మరచి భవిష్యత్‌లో ఏంచేయాలో ఆలోచిద్దామని వ్యాఖ్యానించారు. హమాస్‌తో జరగుతున్న చర్చలు సానుకూలంగా ముగుస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
50 మంది బందీలు.. అక్కడే
కాగా, 2024 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ సంస్థ సాయుధ దాడి చేయగా, అందులో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి అనంతరం దాదాపు 200 మందికి పౌరులను హమాస్ బంధించి గాజాకి తీసుకుపోయింది. ఆ తర్వాత జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వల్ల కొందరిని విడుదల చేయగా, పలువురు బందీలు అక్కడే పలు కారణాలతో చనిపోయారు. ప్రస్తుతం హమాస్ బందీలో 51 మంది సజీవంగా ఉన్నారు. కాగా, ట్రంప్ గద్దెనెక్కనున్న నేపథ్యంలో హమాస్.. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది. అందులో అమెరికా-ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ.. ‘నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని అభ్యర్థించాడు. ఈ వీడియో విడుదలైన గంటల వ్యవధిలోనే ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.