Site icon Prime9

Trump-Zelenskyy: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. ట్రంప్‌, జెలెన్‌ స్కీల మధ్య మాటల తూటాలు!

(COMBO) This combination of pictures created on February 12, 2025 shows (L-R) Ukraine's president Volodymyr Zelensky in Brussels, on October 17, 2024 and US President Donald Trump on February 10, 2025, in Washington, DC. Ukrainian President Volodymyr Zelensky held a telephone call with Donald Trump on February 12, 2025, the presidency in Kyiv said, shortly after the US president said he spoke with Russian President Vladimir Putin. The Ukrainian presidency told reporters that the call lasted approximately one hour. Trump had earlier said he would call Zelensky after speaking with Putin. (Photo by NICOLAS TUCAT and ANDREW CABALLERO-REYNOLDS / AFP)

Donald Trump slams Zelenskyy about Russia and Ukraine war: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కాస్తా ట్రంప్‌, జెలెన్‌ స్కీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై ఫోకస్‌ పెట్టారు. రష్యాతో రాజీకి రావాల్సిందేనని జెలెన్‌స్కీకి ట్రంప్‌ హుకుం జారీ చేస్తున్నారు. దీనికి జెలెన్‌ స్కీ ససేమిరా అంటున్నాడు. ఇది కాస్తా ఇరువురి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జెలెన్‌ స్కీని ఉద్దేశించి ఎన్నికలు నిర్వహించకుండా డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ జెలెన్‌ స్కీపై మండిపడ్డారు ట్రంప్‌. మరో పక్క అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జెడి వాన్స్‌ కూడా జెలెన్‌స్కీపై ధ్వజమెత్తారు. ట్రంప్‌పై అనవసరంగానోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు.

ఇటీవల ట్రంప్‌ జెలెన్‌ స్కీని ఎన్నికలు నిర్వహించకుండా దేశాన్ని డిక్టేటర్‌గా పాలిస్తున్నాడని ఆరోపించాడు. గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం కాస్తా వ్యక్తిగత వైరంలా మారిపోయింది. అయితే ఇక్కడి ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. గత మూడు సంవత్సరాల నుంచి అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలతో పాటు నిధులు కూడా సమకూర్చింది. అయితే వైట్‌హౌస్‌లో ట్రంప్‌ అడుగుపెట్టిన తర్వాత ఉక్రెయిన్‌పై పంధా పూర్తిగా మారిపోయింది. బైడెన్‌ పాలసీని తాను అనుసరించనని చెప్పారు ట్రంప్‌. వెంటనే ట్రంప్‌ మాస్కోతో చర్చలు మొదలుపెట్టారు. బుధవారం నాడు ఫ్లోరిడాలో ఆయన ఎస్టేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జెలెన్‌ స్కీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ”జెలెన్‌ స్కీ త్వరగా నిర్ణయం తీసుకో లేదంటే నీ చిన్న దేశం నీకు కాకుండా పోతుంది’ అంటూ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో హెచ్చరించారు. ఇక ట్రంప్‌ జెలెన్‌ స్కీపై కురిపిస్తున్న ఆరోపణ ఏమిటంటే అక్కడ ఎన్నికలు జరిగిన ఐదు సంవత్సరాలు దాటి పోయింది. జెలెన్‌ స్కీ వాటిని వాయిదా వేస్తూ పోతున్నాడు. జెలెన్‌ స్కీ యుద్ధం పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తూ డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నాడని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

ఎన్నికలు నిర్వహించడానికి జెలెన్‌ స్కీ నిరాకరిస్తున్నాడు. ఆయన బైడెన్‌కు చెంచాగిరి చేయడంలోనే పుణ్య కాలం గడిచిపోయిందని జెలెన్‌స్కీపై ట్రంప్‌ ట్రూత్‌ పోస్టులో ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యాతో మాట్లాడి వెంటనే యుద్ధాన్ని ముగించాలని సంప్రదింపులు మొదలుపెట్టామని చెప్పారు ట్రంప్‌. 2019లో జెలెన్‌స్కీ ఐదు సంవత్సరాల కోసం ప్రెసిడెంట్‌గా ఎన్నికైయ్యాడు. అయితే ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది. రష్యాతో యుద్ధం పేరు చెప్పి ఆయన దేశంలో మార్షల్‌లా ప్రకటించి ఎన్నికలు వాయిదా వేస్తున్నాడు. అతని ప్రజాదరణ దేశంలో కేవలం నాలుగు శాతం కంటే తక్కువగా ఉందని ట్రంప్‌ అంటుంటే , వాస్తవానికి చూస్తే దేశంలో జెలెన్‌ స్కీ ప్రజాదరణ 50 శాతం కంటే ఎప్పడు తగ్గలేదని కీవ్‌ ఇంటర్నేషన్‌ ఇన్సిస్టిట్యూట్‌ఆఫ్‌ సోషియాలజీ వెల్లడించింది. అయితే అమెరికా – రష్యాకు చెందిన విదేశాంగమంత్రుల స్థాయి సమావేశం మంగళవారం నాడు రియాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి జెలెన్‌స్కీని పిలవలేదు. దీంతో జెలెన్‌ స్కీతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ నాయుకులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్‌ ప్రమేమం లేకుండా చర్చలను తాను అంగీకరించనని తెగేసి చెప్పాడు జెలెన్‌ స్కీ. ఇది కాస్తా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది.

జెలెన్‌ స్కీని ఉద్దేశించి .. ట్రంప్‌ చులకనగా సక్సెస్‌పుల్‌ కామేడియన్‌ అంటూ సంబోధించారు. నీవు గెలవని యుద్ధానికి అమెరికాతో 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టించావు. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 31 లక్షల కోట్లు ఖర్చు చేయించావు. అసలు యుద్ధంలోకి పోకుండా ప్రయత్నించాల్సింది. అమెరికా.. ట్రంప్‌ ప్రమేయం లేకుండా యుద్ధం సమస్య పరిష్కారం కాదని ట్రంప్‌ జెలెన్‌ స్కీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జెలెన్‌ స్కీ అసలు ఉద్దేశం యుద్ధం ఇలానే కొనసాగాలి. యుద్ధం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెనకేసుకోవచ్చనే అసలు ఉద్దేశమని ట్రంప్‌ జెలెన్‌ స్కీపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. తాను ఉక్రెయిన్‌ ప్రజలను ప్రేమిస్తాను. అయితే జెలెన్‌ స్కీ మాత్రం ప్రెసిడెంట్‌గా సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ యుద్ధంలో దేశం మొత్తం ధ్వంసం అయ్యింది. లక్షలాది మంది ప్రజలు అనవసరంగా ప్రాణాలు కోల్పోయారు.. ఇప్పటికి కోల్పోతున్నారుఅని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జెలెన్‌ స్కీ కూడా ట్రంప్‌పై మండిపడ్డారు. రష్యా ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ఆయన గుడ్డిగా నమ్ముతున్నాడని.. పుతిన్‌ మాయలో పడిపోయాడు. రష్యా తమను ఓడించలేక ఇలా దొడ్డిదారిన తనను తప్పించడానికి ప్రయత్నిస్తోందని జెలెన్‌ స్కీకి ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. జెలెన్‌ స్కీ అప్రూవల్‌ రేటు నాలుగు శాతం కంటే తక్కువే అని వ్యాఖ్యానించారు. కానీ జెలెన్‌ స్కీ అప్రూవల్‌ రేటింగ్‌ 57 శాతంపైనే ఉంది.

ఇదిలా ఉండగా, ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యాలపై జెలెన్‌ స్కీ ఉక్రెయిన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డారు. తక్షణమే తనను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తేల్చి చెప్పారు. తన అప్రూవల్‌ రేటింగ నాలుగు శాతం అని రష్యా ట్రంప్‌కు తప్పుడు సమాచారం ఇచ్చింది. రష్యా మాయలో ట్రంప్‌ పూర్తిగా పడిపోయాడన్నారు జెలెన్‌ స్కీ. ముందుగా ట్రంప్‌ ఉక్రెయిన్‌ గురించి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌లో ఉండే పౌరుల్లో ఏ ఒక్కరు కూడా రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ను నమ్మరు అని స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌ సైన్యం బలంగా ఉంది. రష్యా ముందు మోకరిల్లడానికి దేశంలోని మెజారిటీ పౌరులు సుముఖంగా లేరని ట్రంప్‌కు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రియాద్‌లో అమరికా, రష్యా విదేశాంగమంత్రులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాల నుంచి సరిగ్గా లేవు. ఇకనుంచి బలమైన సంబంధాలు కొనసాగిస్తూనే వెంటనే ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాన్ని ఆపించడానికి అంగీకరించారు. ఇది కాస్తా జెలెన్‌ స్కీకి ఆగ్రహం తెప్పించింది. తమ ప్రమేయం లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము అంగీకరించమన్నారు జెలెన్‌ స్కీ. ఆయన వాదనకు యూరోపియన్‌ యూనియన్‌ కూడా మద్దతు ప్రకటించింది. సమావేశానికి తమకు ఆహ్వానించలేదు. ఇది తనకుఆశ్చర్యం కలిగించింది. చర్చల్లో టర్కీని, యూరప్‌లను కూడా భాగస్వామ్యం చేయాలని జెలెన్‌ స్కీ డిమాండ్‌ చేశారు.

తాజాగా జెలెన్‌ స్కీ వ్యాఖ్యలకు ట్రంప్‌ ఆగ్రహంతో చిందులు వేయడం మొదలుపెట్టాడు. ఉక్రెయిన్‌ అనవసరంగా రష్యాతో యుద్ధానికి దిగింది. జెలెన్‌ స్కీ అసమర్థ నాయకడు అని వ్యాఖ్యానించాడు ట్రంప్‌.. బేరసారాలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అంటే మూడేళ్ల క్రితం రష్యాలో సంప్రదింపుల ద్వారా ఒప్పందానికి వచ్చి ఉండాల్సింది అని ట్రంప్‌ జెలెన్‌స్కీని ఉద్దేశించి అన్నారు. కాగా ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్ధం ఫిబ్రవరి 24, 2022లో మొదలైంది. మరో మూడు రోజులు దాటితే యుద్ధం కాస్తా మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు అవుతుంది. ఇక తాజాగా అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జెడీ వాన్స్‌ .. తెలుగింటి అల్లుడు కూడా జెలెన్‌ స్కీపై మండిపడ్డారు. ట్రంప్‌ పై నోటికి వచ్చినట్లు వాగితే ఊరుకునేది లేదని కాస్తా గట్టిగానే హెచ్చరించాడు వాన్స్‌. జెలెన్‌ స్కీకి డొనాల్ట్‌ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో సరిగా సలహా ఇచ్చినట్లు లేదన్నారు వాన్స్‌. కాగా అమరికా ఈ యుద్ధంలో బిలియన్‌ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తోంది. దీనికి బదులుగా అమరికాకు ఎలాంటి లాభం లేదు. అలాగే తాము పంపించే డబ్బులో సగం డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని జెలెన్‌ స్కీ కూడా అంగీకరించారని చెప్పాడు అని ట్రంప్‌.

యుద్ధం ఆపించడానికి బైడెన్‌ ఎన్నడూ ప్రయత్నించలేదు. యూరోప్‌ కూడా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకోవడంలో విఫలం అయ్యింది. జెలెన్‌ స్కీ మాత్రం తాము పంపించే డబ్బుతో కులుకుతున్నాడు అని ట్రంప్‌ మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను ప్రేమిస్తున్నాను. జెలెన్‌ స్కీ వల్ల యావత్‌ దేశం నాశనం అయ్యింది. జెలెన్‌ స్కీ నిర్వాకానికి లక్షలాది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్‌ వాపోయాడు. ఇక జెడీ వాన్స్‌ విషయానికి వస్తే గత వారం మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్పరెన్స్‌లోజెలెన్‌ స్కీతో భేటీ అయ్యారని డెయిలీ మెయిల్‌ ఓ వార్తను ప్రచురించింది. ట్రంప్‌ అడ్మినిస్ర్టేషన్‌తో ఎలా వ్యవహరించాలో జెలెన్‌ స్కీకి తప్పుడు సలహా ఇచ్చారని వాన్స్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ ప్రజలను తాము ప్రేమిస్తాం.. వారి సైనికుల ధైర్యసాహసాలను ప్రశంసిస్తాం.. అయితే వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని జెడీ కూడా జెలెన్‌ స్కీకి సలహా ఇచ్చారు.

మొత్తానికి చూస్తే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అటు ఇటు తిరిగి ఇటు ట్రంప్‌కు జెలెన్‌ స్కీకి మధ్య వ్యక్తిగత దూషణల స్థాయికి దిగివచ్చింది. ఉక్రెయిన్‌లో జెలెన్‌ స్కీని తప్పించి .. కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాలనేది ట్రంప్‌ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే రష్యా సంప్రదింపులకు జెలెన్‌ స్కీని దూరం పెడుతున్నారు. మరి ట్రంప్‌ పోకడను జెలెన్‌ స్కీతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు కూడా తప్పు పడుతున్నాయి. మరి శాంతి చర్చలు సాఫీగా సాగుతాయా లేదా వేచి చూడాల్సిందే.

Exit mobile version
Skip to toolbar