Japan Earthquake: జపాన్‌లో న్యూ ఇయర్ రోజున దేశం యొక్క పశ్చిమ తీరాన్ని తాకిన శక్తివంతమైన భూకంపంలో మరణించిన వారి సంఖ్య గురువారం 73కి పెరిగింది. కూలిపోయిన భవనాల క్రింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సుమారుగా పదివేల మంది సహాయం కోసం వేచి ఉన్నారు.
2016 తరువాత ఇదే..(Japan Earthquake)
7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం నుండి మరణించిన వారిలో ఎక్కువమంది నోటో ద్వీపకల్పం ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో ఉన్నారు. 33,000 మందికి పైగా ప్రజలను తమ ఇళ్లనుంచి ఖాళీ చేయించారు. సుమారుగా లక్ష ఇళ్లకు నీటి సరఫరా లేదు.గడ్డకట్టే ఉష్ణోగ్రతలు,భారీ వర్షం నేపధ్యంలో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను విడిపించేందుకు వేలాది మంది రెస్క్యూ సిబ్బంది వేగంగా కదులుతున్నారు. కానీ ధ్వంసమయిన రోడ్లతో అత్యంత కష్టతరమైన మారుమూల ప్రాంతాలకు చేరడం వారికి కష్టంగా మారింది. జపాన్ లో 2016 తరువాత సంభవించిన భూకంపాలలో ఇదే అత్యంత ఘోరమైనదని అధికారులు చెబుతున్నారు.
వృద్ధ మహిళను రక్షించిన కుక్క..
సెంట్రల్ జపాన్‌లో భారీ భూకంపం కారణంగా ధ్వంసమైన ఇంట్లో చిక్కుకున్న వృద్ధ మహిళను సెర్చ్ డాగ్ కనుగొని రక్షించిందని ఆ దేశ రక్షణ మంత్రి గురువారం తెలిపారు.న్యూ ఇయర్ రోజున సంభవించిన 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలలో జెన్నిఫర్ అనే కుక్క ఒకటి. జపాన్ సముద్ర తీరంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం వారు వేలాది మంది సైనికులు మరియు అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలిస్తున్నారు.ఆత్మరక్షణ దళాలు బుధవారం నాటికి 122 మందిని రక్షించాయి, వాజిమా సిటీలోని ఒక ఇంట్లో ఉన్న ఒక వృద్ధ మహిళను సెర్చ్ డాగ్ (జెన్నిఫర్) కనుగొని రక్షించిందని రక్షణ మంత్రి మినోరు కిహరా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో రాశారు.