Site icon Prime9

Syria: మొదలైన అంతర్యుద్ధం.. మళ్లీ సంక్షోభం దిశగా సిరియా

Civil war again in Syria: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు టర్కీ, కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల మద్దతుతో .. రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియాను ఏలుతున్న బషర్- అల్-అస్సాద్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించి దేశంలోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే సిరియాలోని సనా, హమా సిటీతో బాటు దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పా నగరాన్ని ఇప్పటికే ఆక్రమించుకున్న ఈ దళాలు.. రాజధాని డమాస్కస్ దిశగా సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి వారు ఆ నగరాన్ని ఆక్రమించుకోవటానికి వారికి ఎక్కువ సమయం పట్టేలా కనిపించటం లేదు. ఒకవేళ.. అదే జరిగితే.. సిరియా పూర్తిగా తిరుగుబాటు వర్గాల చేతుల్లోకి పోవటమే గాక బషర్-అల్-అస్సాద్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. 2010 నుంచి దాదాపు దశాబ్ధం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లిన సిరియా గత నాలుగేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే, మళ్లీ ఇప్పుడు హటాత్తుగా తిరుగుబాటుదారులు ప్రభుత్వ దళాల మీద రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడటం వెనక అనేక దేశాల హస్తం ఉందనేది బహిరంగ సత్యమే.

ఈ తాజా తిరుగుబాటు వెనక గల కారణాలను తెలుసుకోవాలంటే సిరియాకు సంబంధించిన రెండు దశాబ్దాల చరిత్రలోకి వెళ్లాలి. తన తండ్రి హఫీజ్ స్థానంలో 2000వ సంవత్సరంలో ప్రస్తుత పాలకుడైన బషర్ అల్-అస్సాద్ సిరియా పాలనా పగ్గాలు చేపట్టారు. సిరియా జనాభాలో సున్నీల ప్రాబల్యం అధికం. అయితే, అధ్యక్షుడైన అస్సాద్.. షియా అలావైట్ వర్గానికి చెందిన నేత. దీంతో సున్నీ మెజారిటీ దేశాన్ని షియా నాయకుడు పాలించటమేంటని పలు సున్నీ గ్రూపులకు కడుపుమంటగా ఉండేది. అటు అస్సాద్ దశాబ్దకాలపు అసమర్థ పాలనతో 2011 నాటికి సిరియాలో నిరుద్యోగం, అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోవటం, రాజకీయ స్వేచ్ఛ లేకపోవటం, ప్రభుత్వ అణచివేత తారస్థాయిని చేరటం జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే (2011లో) ట్యునీషియాలో వచ్చిన విప్లవం.. ‘అరబ్‌ వసంతం’పేరిట అనేక అరబ్ దేశాలకు విస్తరించింది. రాచరిక పాలకులను ఇంటికి పంపి వారి స్థానంలో ప్రజాస్వామ్యం కావాలనే నినాదంతో వచ్చిన ఈ ఉద్యమంతో ఈజిప్టులో అధ్యక్షుడు గద్దె దిగిపోవాల్సి వచ్చింది. తమకూ ఇలాంటి మార్పు కావాలని పొరుగునే ఉన్న సిరియా ప్రజలూ భావించారు. ప్రజల ఆలోచనను గమనించిన అస్సాద్ కుర్చీని కాపాడుకునేందుకు తీవ్రమైన అణచివేతకు దిగారు. దీంతో జనం ఆయుధాలు చేతబట్టారు. వీరికి సైన్యంలోని అస్సాద్ వ్యతిరేక వర్గం, కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల మద్దతు లభించటంతో వారు.. సమరోత్సాహంతో ప్రభుత్వ సేనల మీద పోరాడి పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. నిజానికి తిరుగుబాటు దారుల్లోని అనేక వర్గాల సిద్ధాంతాలు వేరైనా అప్పటికి… అస్సాద్ ప్రభుత్వాన్ని తొలగించటమే వీరి ప్రధాన లక్ష్యంగా ఉండేది. అస్సాద్ అంటే గిట్టని టర్కీ, సున్నీ మెజారిటీ దేశమైన సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా కూడా అప్పట్లో ఈ తిరుగుబాటుదారులకు బాగా అండగా నిలిచాయి.

ఈ పరిస్థితి చూసి భయపడిన అస్సాద్.. షియా దేశమైన ఇరాన్, రష్యా సాయాన్ని కోరారు. దీంతో ఇరాన్‌.. సిరియా కోసం ఇరాన్ ఏటా వందల కోట్ల డాలర్లు వెచ్చించి సైనిక సలహాదారులను, రాయితీతో ఆయుధాలను, రుణాన్ని, చమురును అందించింది. అదే సమయంలో లెబనాన్‌లోని షియా ఇస్లామిక్ రాజకీయ, మిలిటరీ సంస్థ ‘హెజ్బొల్లా’కు ఇరాన్ నుంచి ఆయుధాలను తరలించాలంటే ప్రధానంగా సిరియా నుంచే తరలించాల్సి ఉండటంతో.. హెజ్బొల్లా సంస్థ కూడా తన తరపున వేలాది మంది సాయుధులను అస్సాద్ సేనలకు అండగా సిరియా పంపింది. అలాగే.. అరబ్ రీజియన్‌లో తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. రష్యా ఏకంగా తన యుద్ధ విమానాలతో సిరియా తిరుగుబాటుదారుల మీద విరుచుకుపడింది. దీంతో 2016 ద్వితీయార్ధంలో తూర్పు అలెప్పోను, 2017 సెప్టెంబరు నాటికి తూర్పు సిరియాలోని డీర్ అల్-జౌర్ నగరాన్ని తిరుగుబాటుదారుల నుంచి అస్సాద్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది.

ప్రారంభంలో ఈ పోరు… అసద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరులా కనిపించినప్పటికీ, కాలక్రమంలో ఇది క్రమేణా విస్తృతమైంది. ఈ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ దేశాలు.. సిరియాలోని అస్సాద్ వ్యతిరేకులైన తిరుగుబాటు దారులకు అండగా నిలవగా.. పాలకుడైన అస్సాద్ పక్షాన రష్యా, ఇరాన్, లెబనాన్‌కు చెందిన ‘హెజ్బుల్లా’ సంస్థలు గట్టిగా నిలిచాయి. ఇలా.. సిరియా ఏడున్నర సంవత్సరాల పాటు విదేశీ శక్తుల పరోక్ష యుద్ధానికి కేంద్రంగా మారింది. ఈ సమయలోనే తిరుగుబాటుదారులకు మద్దతు అందించే నెపంతో సిరియాలోకి ప్రవేశించిన అల్‌ఖైదా, ఐసిస్‌ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు 2014 నాటికి గట్టిగా బలపడ్డాయి. ఒక దశలో ఈ జిహాదీ సంస్థల నీడలోకి సిరియా వెళ్లిందా అనే అనుమానం రావటంతో వెంటనే మేల్కొన్న అమెరికా.. రంగంలోకి దిగి సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఎస్‌డీఎఫ్‌) సాయంతో విరుచుకుపడి.. అల్‌ఖైదా, ఐసిస్‌ సిరియా నుంచి పారిపోయేలా చేసింది. ఆ సమయానికి సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్ల చేతిలో ఉండటంతో… ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నాటినుంచి కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల చేతిలోనే ఉండిపోయింది. 2011 నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు సాగిన ఈ పోరులో సుమారు 3 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా, 60 లక్షల మంది దేశం విడిచి లెబనాన్, టర్కీ, జోర్డాన్‌లతో బాటు పలు ఐరోపా దేశాలకు పారిపోయారు. 2018 నుంచి కాస్త కుదుటపడుతున్న ఆ దేశంలో తాజాగా మరోసారి పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

నాలుగేళ్లుగా స్తబ్దంగా ఉన్న సిరియాలో ఉన్నట్టుండి అంతర్యుద్ధం రావటానికి బలమైన కారణాలే ఉన్నాయి. అసద్‌ మిత్రదేశమైన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలుగా ఉండటంతో సిరియాను ఆదుకునే స్థితిలో లేదు. అలాగే అస్సాద్‌కు గట్టి అండగా నిలిచిన ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ పదేపదే దాడులు చేస్తూ.. ఉక్కపోతకు గురిచేస్తోంది. ఇదే ఇజ్రయెల్ లెబనాన్‌లోని హెజ్బుల్లా సంస్థ మీద విరుచుకుపడి.. వారి స్థావరాలను నేలమట్టం చేయటంతో వారు.. అస్సాద్‌కు అండగా నిలిచే పరిస్థితి లేదు. దీంతో ఎటు నుంచి కూడా సాయం అందక.. సిరియా అధ్యక్షుడు అస్సాద్.. నిస్సహాయ స్థితిలో పడిపోయారు. అటు విదేశీ సాయం కూడా నిలిచిపోవటంతో ప్రభుత్వమూ బలహీనపడింది. సైన్యంలో ఈ పరిస్థితిని గమనించిన తిరుగుబాటుదార్లు ఒక్కసారిగా క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్‌ కమాండ్‌’పేరిట కొత్త కూటమి కట్టారు. ప్రస్తుతం సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్‌ కమాండ్‌’కు హయత్‌ తాహ్రీర్‌ అల్‌-షామ్‌ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఇది గతంలో అల్‌-నుస్రా ఫ్రంట్‌ పేరుతో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లో అధికారం చెలాయిస్తోన్న ఈ సంస్థకు టర్కీ, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు అండగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి కూడా ఈ సంస్థకు భారీగా సాయం అందిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతో తిరుగుబాటుదారులు సిరియా మొత్తాన్ని ఆక్రమించుకోవటానికి ఎక్కువ సమయం పట్టదని అంతర్జాతీయ సమాజం అంచనావేస్తోంది. అయితే.. వారి అంచనా మేరకు అస్సాద్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత సిరియాలో ప్రజాస్వామ్యం పరిమళిస్తుందా? లేక మళ్లీ విదేశీ శక్తుల మద్దతుతో నడిచే కీలుబొమ్మ పాలకులే పెత్తనం చేస్తారా? అనేవి ఇప్పుడు ఒక జవాబు లేని ప్రశ్నలుగా నిలుస్తున్నాయి.

Exit mobile version