Site icon Prime9

Canada: విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా.. మరో 4 గంటలు వెసులుబాటు!

Canada extends working hours for students: కెనడా దేశానికి ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల పని గంటల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో పనిచేసే సమయాన్ని పెంచుతున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు.. ఇక 24 గంటలు కానుంది. దీంతో ఆ దేశంలో చదువుకుంటూ పనిచేస్తున్న విద్యార్థులకు మేలు జరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు చదువును కొనసాగిస్తూనే పార్ట్ టైం ఉద్యోగాలు మరో నాలుగు గంటలు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది.

అయితే, కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు విద్యావేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పనిచేసుకునే సమయం పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల చదువుపై ఏమైనా ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు, పని సమయం పెరిగినందున విద్యార్థుల ఆదాయం పెరగడంతో పాటు చదువు, పని అనుభవం కూడా పెరుగుతోందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కెనడా ప్రభుత్వం ఇటీవల స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ నిలిపివేసింది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో అశాంతి నెలకొంది. విద్యార్థులు పని చేసుకునేందుకు తప్పనిసరిగా కాలేజీ లేదా యూనివర్సిటీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సోషల్ ఇన్సూరెన్స్ నంబర్‌తో విద్యార్థులు వారానికి 24 గంటలు పనిచేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇందులో ఒక విద్యార్థి రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే.. మొత్తం పని గంటలను కలిపి 24 గంటలకు మించకూడదనే నిబంధన తీసుకొచ్చింది.

విద్యార్థులు తప్పనిసరిగా ఎంచుకున్న సంస్థలో పూర్తి సమయం విద్యను అభ్యసిస్తూ ఉండాలి. అలాగే కాలేజీ లేదా యూనివర్సిటీలో చదువుతో పాటు వృత్తి పరంగా శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుండాలి. దీంతో పాటు విద్యార్థుల కోర్సు తప్పనిసరిగా 6 నెలలు ఉండడంతో పాటు కోర్సు పూర్తయితే డిగ్రీ, డిప్లొమా లేదా ఏదైనా సర్టిఫికెట్ పొంది ఉండాలి. విద్యార్థులు సొంత సోషల్ ఇన్సూరెన్స్ నంబర్ కలిగి ఉండాలి.

Exit mobile version