Avtar Singh Khanda : బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. అవతార్ సింగ్ ఖాందా.. కేఎల్‌ఎఫ్ చీఫ్ మాత్రమే కాదు, ఈ ఏడాది మార్చి 19వ తేదీన లండన్‌లోని భారత్ హైకమిషన్ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి. ఈ ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇక అసలు విషయానికి వస్తే పోలీసులకు అమృత్‌పాల్ సింగ్ చిక్కకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్ అతనికి సహకరించినట్లు సమాచారం.
అమృత్‌పాల్ సింగ్ కు గురువుగా ..(Avtar Singh Khanda )
ఎల్‌ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ కుమారుడు ఈ అవతార్. బాంబులు తయారు చేయడంలో దిట్ట. 2007లో బ్రిటన్‌కు స్టూడెంట్ వీసాపై వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్‌ఎఫ్ మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్యానంతరం.. కేఎల్‌ఎఫ్‌లో రాంజోధ్ సింగ్ కోడ్ నేమ్‌తో అవతార్ కొనసాగాడు. దీప్ సింగ్ మరణాంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్‌గా అమృత్‌పాల్ సింగ్ నియామకంలోనూ అవతార్ సింగ్‌దే కీలక పాత్ర అని చెబుతారు. గురువు పాత్రలో అమృత్‌పాల్ ప్రతీ వ్యవహారాన్ని అవతార్ చూసుకుంటూ వచ్చాడు. ఇక పంజాబ్‌లో 37 రోజులపాటు అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సమయంలో బ్రిటన్ నుంచి అవతార్ సహాయసహకారాలు అందించాడని ఎన్‌ఐఏ నిర్ధారణకు వచ్చింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్ సింగ్ బర్మింగ్‌హమ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై ఫుడ్ పాయిజన్ జరిగిందనే అనుమానాల మధ్య దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 23న పంజాబ్‌లోని మోగాలో అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోగా అసోంలోని దిబ్రుఘడ్ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి.