Venezuela prison: వెనిజులా లోని ఒక జైలు నుంచి బిట్‌కాయిన్ మైనింగ్ మెషిన్లు,రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగిచింది. జైలును తమఆట స్థలంగా,ఒక కొలనుగా,నైట్ క్లబ్ గా మార్చేసిన ముఠానుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
ఏడాదికి పైగా ప్లాన్ చేసి..(Venezuela prison)
11,000 కంటే ఎక్కువ మంది పోలీసులు మరియు సైనికులు ట్యాంకులు మరియు సాయుధ వాహనాలతో భారీ ఆపరేషన్ నిర్వహించి వెనిజులా లోని టోకోరాన్ జైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఏడాదికి పైగా ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్‌లో ఒక సైనికుడు మరణించాడని అంతర్గత మరియు న్యాయ శాఖ మంత్రి రెమిజియో సెబల్లోస్ తెలిపారు. వెనిజులా మరియు ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రెన్ డి అరగువా ముఠాకు ప్రధాన కార్యాలయంగా ఈ జైలు మారింది. కొకైన్, గంజాయి మరియు ఖరీదైన మోటార్‌బైక్‌లతో పాటు స్నిపర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు మరియు గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సెబాలోస్ చెప్పారు.జైలు లోపల నివసిస్తున్న ఖైదీల భార్యలు లేదా స్నేహితురాళ్లను బయటకు గెంటేశారు.
జైలు వెలుపల విలేకరుల సమావేశంలో, అధికారులు బుల్లెట్ల బకెట్లు, మెషిన్ గన్ మందుగుండు బెల్టుల కుప్పలు మరియు క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ను తవ్వడానికి ఉపయోగించే యంత్రాలను ప్రదర్శించారు.జైలు నుండి టెలివిజన్లు, మైక్రోవేవ్లు మరియు ఎయిర్ కండీషనర్లను తీసుకువెళుతున్న అధికారులను చూసి బయట ఉన్న మహిళలు అవి మావంటూ కేకలు వేసారు. జైలును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం తన 1,600 మంది ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలించడం ప్రారంభించింది.