Dog Nanny Job: మనషులకన్నా కుక్కలకే వాల్యూ ఇస్తున్నారు ఇప్పటికాలం వారు అంటే ఏమో అనుకున్నా భయ్యా కానీ ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది. కుక్కను చూసుకునే ఉద్యోగం.. జీతం కోటికి పైగానే అంటే మామూలు లేదకదా. ఏంటీ షాక్ అయ్యారా..? మరి ధనవంతుల కుక్కల రేంజ్ అంటే అంతే ఉంటుంది కదా. కుక్కకు కాపాల కాసే ఉద్యోగమే కదాని తేలిగ్గా ఏదో ఓ మూలను కుక్కను పట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా.. కానేకాదండోయ్ ఆ ఉద్యోగికి ఆ కుక్క యజమాని కల్పించే సౌకర్యాలు చూస్తే కళ్లు చెదిరిపోతాయనుకోండి. జీతానికి తగ్గట్లుగానే, కుక్క రాజభోగానికి తగినట్లుగా సౌకర్యాలు కూడా ఉన్నాయండోయ్. దీనితో ఈ కుక్కను కాపలా కాసే ఉద్యోగానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
లగ్జరీ లైఫ్ అంటే ఇదేనేమో(Dog Nanny Job)
ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్, కెన్సింగ్టన్‌లో ఒక బిలియనీర్ కు ఉన్న కుక్కల్ని చూసుకోవానికి ఉద్యోగి కావాలంటూ ప్రకటించారు. ఆయనకున్న రెండు కుక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలి అంటూ డాగ్ నానీ జాబ్స్ అంటూ ప్రకటన విడుదలచేశారు. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి అతను అక్షరాల కోటి రూపాయల శాలరీ ప్రకటించారు. ఉద్యోగికి సంవత్సరానికి ఆరు వారాలు సెలవులు.. అంతేకాకుండా ఆ కుక్కలతో కలిసి ఎంచక్కా విమానం ప్రయాణాలు కూడా చేయొచ్చు. ఇవేకాకుండా మంచి వసతి, భోజన ఏర్పాట్లు కూడా ఆ ఉద్యోగికి కల్పించడం జరుగుతుంది.
డాగ్ నానీ జాబ్ చేయాల్సిన పనులేమంటే.. కుక్కలకు సరైన సమయానికి ఆహారం పెట్టాలి. టైముకి డాక్టర్ వద్దకు చెకప్ లకు తీసుకెళ్లాలి. వాటికి శుభ్రంగా స్నానం చేయించటం, ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం.. వాటిని వాకింగ్ కు తీసుకెళ్లటంతోపాటు వాటిని ఎప్పుడు ఉత్సాహంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు తప్పనిసరిగా కుక్కల గురించి అవి తినే ఆహారం, తాగే పానీయాల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ కుక్కలే జీవితంగా ఉండాలి. మరి కోటి రూపాయల జీతం ఊరికే వస్తుందా చెప్పండి.