Site icon Prime9

Qatar: ఖతర్‌ కోర్టులో మాజీ నౌకాదళ అధికారులకు ఊరట

Qatar

Qatar

Qatar: గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ నౌకాదళ అధికారుల కు ఖతర్‌ లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.

శిక్ష కుదింపు..(Qatar)

ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.కాగా గురువారం నాడు కోర్టు విచారణ సందర్భంగా ఖతర్‌లో భారత రాయబారితో పాటు అధికారులు, మాజీ నౌకాదళ కుటుంబసభ్యులు కోర్టు విచారణ సందర్భంగా హాజరయ్యారు. మాజీ నౌకదళ అధికారులకు శిక్షణపడినప్పటి నుంచి వారికి భారత ప్రభుత్వం అండగా ఉందని.. ఖతర్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ న్యూఢిల్లీలో చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఖతర్‌ అమీర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమాద్‌ దుబాయిలో భేటీ అయిన తర్వాత నుంచి పరిణామాలు చకచకా ముందుకు జరిగాయి. ప్రస్తుతానికి అక్కడి కోర్టులు మరణ శిక్ష నుంచి సాధారణ శిక్షకు కుదించడంతో నేవి అధికారుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ కేసు పూర్వా పరాల విషయానికి వస్తే భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు అల్‌ దహ్రా సంస్థ లో పనిచేస్తున్నారు. ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు. అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఆ 8 మందికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబరులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది.

Exit mobile version
Skip to toolbar