Bethlehem: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవులు డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహామ్‌లో మాత్రం ఈ ఏడాది కళతప్పింది. ఎక్కడ క్రిస్మస్ ట్రీ, కానీ ప్రజల్లో సంతోషం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ సంవత్సరం ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం కారణంగా ఈ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సావనీర్ దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి. అక్టోబర్ 7 నుండి దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులు, గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడి మరియు వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరగడం వంటి వార్తలతో ఎవరూ రావడం లేదని బెత్లెహెమ్‌లోని వ్యాపారస్తులు చెప్పారు.
క్రిస్మస్ ఆనందం లేదు..( Bethlehem)
మాకు అతిథులు లేరు. ఒక్కరూ కూడా లేరంటూ స్దానిక అలెగ్జాండర్ హోటల్ యజమాని జోయ్ కనావతి అన్నారు. అతని కుటుంబం నాలుగు తరాలుగా బెత్లెహెమ్‌లో నివసిస్తున్నారు .ఇది ఎప్పటికీ చెత్త క్రిస్మస్. క్రిస్మస్ కోసం బెత్లెహెం మూసివేయబడింది. క్రిస్మస్ చెట్టు లేదు, ఆనందం లేదు, క్రిస్మస్ స్ఫూర్తి అనేది లేదు అని అతను చెప్పారు. జెరూసలేంకు దక్షిణంగా ఉన్న బెత్లెహెం, జీసస్ జన్మించిన ప్రదేశంలో నిలబడాలని క్రైస్తవులు విశ్వసించే చోటు. చర్చ్ ఆఫ్ ది నేటివిటీని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులపై ఆదాయం మరియు ఉద్యోగాల కోసం ఎక్కువగా ఆధారపడుతుంది.అక్టోబరు 7కి ముందే, క్రిస్మస్ కోసం తన హోటల్ పూర్తిగా బుక్ అయిందని, మిగిలిన వారికి పట్టణంలోని వేరే చోట గదుల కోసం వెతుకుతున్నామని కనవతి చెప్పారు.అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, వచ్చే ఏడాది బుకింగ్‌లతో సహా అందరూ రద్దు చేసుకున్నారు. మేము ఈ మెయిల్స్ లో వరుసగా క్యాన్సిల్ ఆర్డర్స్ ను తీసుకుంటున్నామని కనావతి చెప్పారు.అతను తన హోటళ్లోని ఖాళీ గదులను, నిశ్శబ్దంగా ఉన్న డైనింగ్ హాల్ ను చూపించారు. ప్రతీ రాత్రి ఇక్కడ కనీసం 120 మంది డిన్నర్ చేస్తారు. కానీ ఇపుడు ఖాళీగా ఉంది. క్రిస్మస్ బ్రేక్‌ఫాస్ట్ లేదు.. డిన్నర్ లేదు.. బఫే లేదు అని కనావతి పేర్కొన్నారు.
నిర్మానుష్యంగా దుకాణాలు.. వీధులు ..
బెత్లెహెం యొక్క మాంగర్ స్క్వేర్, చర్చ్ ఆఫ్ ది నేటివిటీకి ఎదురుగా ఒక పెద్ద చదునుతో కూడిన స్థలం. ఇది సాధారణంగా క్రిస్మస్ వేడుకలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలోని దుకాణాలన్ని మూతబడి వీధి అంతా నిర్మానుష్యంగా మారింది. తన కుటుంబ దుకాణంలో సిలువలు, కన్య మేరీ విగ్రహాలు మరియు ఇతర మతపరమైన చిహ్నాలను విక్రయించే రోనీ తబాష్ సమయం గడపడానికి అల్మారాలు మరియు సరుకులను సర్దుతున్నాడు.మేము దాదాపు రెండు నెలలుగా ఎటువంటి యాత్రికులు, ఏ పర్యాటకులు లేకుండా ఉన్నామని అతను చెప్పాడు. మరో గత్యంతర లేక దుకాణాన్ని తెరిచి ఉంచుతున్నానని చెప్పాడు. మరలా సాధారణ జీవితం నెలకొంటుందని భావిస్తున్నానని అన్నాడు. ఫాలాఫెల్ రెస్టారెంట్ అఫ్తీమ్ యజమాని అలా సలామెహ్, తన వ్యాపారం 10% సామర్థ్యంతో పనిచేస్తోందని, విదేశీ పర్యాటకులకు బదులుగా స్థానిక పాలస్తీనియన్ కుటుంబాలు వచ్చి వెడుతున్నాయని అన్నాడు. తన రెస్లారెంట్లో పనిచేసే కార్మికులకు వేతనాలు అయినా చెల్లించాలి కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. కరోనా మహమ్మారి సమయంలో ఇటువంటి పరిస్దితి చూడలేదని వ్యాపారులు వాపోతున్నారు. మొత్తంమీద యుద్దం వేలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా వాణిజ్యాన్ని కూడా కుదేలు చేసింది.
అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 240 మందికి పైగా బందీలుగా చేసింది.మరోవైపు పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడుల్లో 20 వేలమందికి పైగా మరణించగా 50 వేలమందికి పైగా గాయపడ్డారు.