Bernard Arnault: ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఆయన సంపదలో ఒక్కరోజులో సుమారు రూ. 90 వేల కోట్లు( 11 బిలియన్ డాలర్లు) నష్టపోయారు. ఇందుకు కారణం.. అమెరికా ఆర్థిక సంక్షోభానికి సమీపిస్తుందని.. దాని వల్ల లగ్జరీ వస్తువులకు డిమాండ్ తగ్గుతందనే ఆందోళనల ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. మార్కెట్ల ప్రభావంతో ఆయన సంపదలో తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి.
ఏడాదిలో 25 శాతం వృద్థి(Bernard Arnault)
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది. యూరప్ లగ్జరీ బ్రాండ్లకు అమెరికాతో పాటు ఆసియా దేశాల్లో అతిపెద్ద మార్కెట్ ఉంది. ఎల్‌వీఎంహెచ్ 2022 నివేదిక ప్రకారం.. ఆ సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో 27 శాతం అమెరికా వాటా కాగా ఆసియా వాటా 30 శాతంగా ఉంది. ఇటీవల ఈ వాటాలు భారీగా పెరగడంతో 2023లో బెర్నార్డ్ సంపద కూడా భారీగా పెరిగింది. కేవలం సంవత్సర కాలంలోనే ఆయన కంపెనీ వృద్థిలో 25 శాతం పెరుగుదల నమోదు అయింది.
ఆర్థిక మాంద్యం ప్రభావంతో
ఈ క్రమంలో, ఇటీవల అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రభావం లగ్జరీ బ్రాండ్‌లపై స్పష్టంగా కనిపించింది. దీంతో సదరు కంపెనీల విలువ 30 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. వీటిలో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్ కూడా సుమారు 5 శాతం పడిపోయింది. మరో ఫ్రెంచ్ లగ్జరీ సంస్థ కేరింగ్ ఎస్‌ఏ కూడా 2 శాతం నష్టాలను చవి చూసింది. ఇలా లగ్జరీ బ్రాండ్ల షేర్లు పతనం అవ్వడం.. కుబేరుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌పై తీవ్రంగానే పడింది. దీంతో ఆయన మొత్తం సంపదలో కేవలం ఒక్క రోజే 11 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. అంతా నష్టపోయినా కూడా సుమారు 192 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత కుబేరుడి జాబితాలో బెర్నార్డ్.. టాప్ లోనే కొనసాగుతున్నారు. రెండవ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు బెర్నార్డ్ సంపద మధ్య వ్యత్యాసం దాదాపు 12 బిలియన్ డాలర్లు మాత్రంగా ఉంది.