Italy PM’s Partner: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునో తాజాగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు అతిగా తాగకుండా ఉంటే అత్యాచారాలను నివారించవచ్చని అతను వ్యాఖ్యానించాడు.
తిరోగమన సంస్కృతి..(Italy PM’s Partner)
ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో గియాంబ్రునో మాట్లాడుతూ మహిళలు డ్యాన్స్ చేయడానికి వెళితే ఎక్కువగా తాగకుండా ఉండటం మంచిది. అలా చేస్తే స్పృహ కోల్పోకుండా ఉంటారు. అపుడు పురుషులకు అత్యాచారం చేసే అవకాశం ఉండదని అన్నాడు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గియాంబ్రునో బాధితులని నిందిస్తున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వచ్చాయి , ప్రతిపక్ష పార్టీలు జార్జియా మెలోనిని ఆమె భాగస్వామి చేసిన వ్యాఖ్యల నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చాయి.ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష, ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ పార్టీ (M5S), ఒక ప్రకటనలో గియాంబ్రునో మాటలు ఆమోదయోగ్యం కాదు. అవమానకరమైనవి. అవి పురుష-ఆధిపత్య మరియు తిరోగమన సంస్కృతిని సూచిస్తాయని పేర్కొంది.
అయితే గియాంబ్రునో తన వ్యాఖ్యలను సమర్దించుకున్నాడు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, నేను క్షమాపణలు చెప్పేవాడిని, అత్యాచారం అసహ్యకరమైన చర్య అని నేను చెప్పాను. యువకులను ఉద్దేశపూర్వకంగా తాగి డ్రగ్స్ సేవించవద్దని చెప్పే స్వేచ్ఛను నేను తీసుకున్నాను. దురదృష్టవశాత్తు, చెడ్డ వ్యక్తులు ఎల్లప్పుడూ బయట ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను వారికి సలహా ఇచ్చాను. నేను ఎప్పుడూ మద్యం మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారం చేయడానికి పురుషులు అర్హులు అని చెప్పలేదని అన్నాడు.