Aung San Suu Kyi : జైలు శిక్ష అనుభవిస్తున్న మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఐదు క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష లభించిందని, అయితే ఆమె ఇంకా 14 కేసులను ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర మీడియా మంగళవారం తెలిపింది. 7,000 మందికి పైగా ఖైదీల క్షమాభిక్షలో భాగంగా ఈ ప్రకటన వెలువడింది.
2021 నుంచి నిర్బంధంలో..(Aung San Suu Kyi)
2021 సైనిక తిరుగుబాటులో తొలగించబడినప్పటి నుండి నిర్బంధంలో ఉన్న సూకీ కి, అవినీతి, అక్రమ వాకీ టాకీలను కలిగి ఉండటం మరియు కరోనావైరస్ పరిమితులను ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో సహా 33 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. గత వారం రాజధాని నైపిటావ్‌లో జైలు నుండి గృహనిర్బంధానికి ఆమెను మార్చారు. మయన్మార్ స్వాతంత్ర్య వీరుడి కుమార్తె అయిన 78 ఏళ్ల సూకీ ని దశాబ్దాల సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల తర్వాత 1989లో తొలిసారి గృహనిర్బంధంలో ఉంచారు.
1991లో, ఆమె ప్రజాస్వామ్యం కోసం ప్రచారం చేసినందుకు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. 2010లో గృహనిర్బంధం నుండి పూర్తిగా విడుదలైంది.సైనిక సంస్కరణల్లో భాగంగా జరిగిన 2015 ఎన్నికల్లో ఆమె విజయం సాధించింది. అయితే ఐదు కేసుల్లో ఆమె క్షమాభిక్ష ప్రకటించినప్పటికీ ఆమె నిర్బంధంలోనే ఉంటుందని సమాచారం. దేశవ్యాప్తంగా నిర్వహించే బౌద్దపండుగ సందర్బంగా మయన్మార్ ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటిస్తూ ఉంటుంది.