Jill Biden: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు పరీక్షల్లో తేలింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది.
అధ్యక్షుడు బైడెన్ కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు ఈ నెల 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు.