Donald Trump Blocks Military Aid To Ukraine: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ దేశానికి అందించే సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మిలటరీ సహాయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెల్లడైంది.
ఇదిలా ఉండగా, రష్యా దేశంతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సహకరించడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ఆ దేశానికి అందించే మిలటరీ సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ఇందులో భాగంగానే కీలక ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా, ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు.’ అని తెలిపింది.
అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమేనని శ్వేతసౌధంలోని ఓ అధికారి వెల్లడించారు. కాగా కేవలం రష్యా దేశంతో శాంతి జరిపించాలనే ఉద్దేశంతో కీవ్‌పై ఒత్తడి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన భేటీ వాగ్వాదానికి గురైంది. రష్యా దేశంతో యుద్దం విషయంలో శాంతి ఒప్పందం, అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖనిజాల తవ్వకానికి పర్మిషన్ ఇవ్వాలని అమెరికా కోరిన ప్రతిపాదనపై జెలెన్ స్కీ వైట్ హౌస్ వచ్చారు. అయితే ఈ చర్చల్లో భాగంగా భవిష్యత్తులో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి యత్నిస్తే.. రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు ఫైర్ అయ్యారు.
ఈ విషయంపై ట్రంప్ మీడియాతో ప్రస్తావించారు. అమెరికా దేశానికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయంలో అవమానం చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం జెలెన్ స్కీని మీడియా ముందే తిట్టిపోశారు. దీంతో వైట్ హౌస్ నుంచి ఆయన ఒప్పందం సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. అనంతరం లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం వెళ్లగా.. జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందానికి సిద్దమేనని ప్రకటించారు. ట్రంప్‌తో మరోసారి భేటికి వెళ్తానని చెప్పారు. ఈ తరుణంలోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపివేడయం గమనార్హం.