Amazon: అమెజాన్ లో 18 వేల మంది ఉద్యోగుల తొలగింపు..!

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది.

  • Written By:
  • Publish Date - January 5, 2023 / 01:24 PM IST

Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది. కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గతేడాది నవంబర్ నెలలో పదివేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. జనవరిలో మరో 18వేల మందిని ఇంటికి పంపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అమెజాన్ గురువారం జనవరి 2023లో తొలగింపులను కొనసాగిస్తున్నట్లు ధృవీకరించింది. టెక్ దిగ్గజం గత ఏడాది నవంబర్‌లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.

రాబోయే తొలగింపులను ప్రకటిస్తూ ఆండీ జాస్సీ అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ” కారణంగా, కంపెనీ ఇప్పుడు తన వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా తొలగింపులను ప్లాన్ చేస్తోందని సిబ్బందికి ఒక సందేశంలో తెలిపారు. కంపెనీ తన కస్టమర్ల ఆరోగ్యం మరియు తన వ్యాపారం యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది.తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు.

ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా యూరప్‌లో ఉండనుంది. జనవరి 18 నుంచి విధుల నుంచి తొలగించే వారికి త్వరలోనే సమాచారం ఇవ్వనున్నట్లు సీఈవో ఆండీ జాస్సీ చెప్పారు. అయితే, సహచర ఉద్యోగి ఒకరు ఈ సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడం వల్ల అకస్మాత్తుగా ఉద్యోగులతో ఈ సందేశాన్ని పంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు.