Turkey-Syria earthquake:భారీ భూకంపం సంభవించిన తుర్కియే, సిరియాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. విపరీతంగా కురుస్తున్న మంచు, తరచూ వస్తున్న ప్రకంపనలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. కాగా భూకంపం వచ్చి 72 గంటలు దాటిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉంటాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21 వేలుదాటి పోయింది. మరోవైపు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 21వేలు దాటింది. ఒక్క తుర్కియేలోనే 17,674 మంది బలవ్వగా.. సిరియాలో 3,377 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21,051కి పెరిగింది. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ వారు సజీవంగా ఉండే అవకాశాలు మాత్రం సన్నగిల్లుతాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సహాయక బలగాలు కాలంతో పోటీపడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని వాట్సప్ కాపాడింది. తూర్పు తుర్కియే లోని ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. సమయస్ఫూర్తితో ఆలోచించి సోషల్‌మీడియా ద్వారా తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నది చెప్పాడు. వాట్సప్ స్టేటస్ షేర్ చేయడంతో అతడి స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడి శిథిలాలను తొలగించి ఆ విద్యార్థిని కాపాడారు. అయితే అతడి బంధువులు మాత్రం ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. ఇండియా నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్‌కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు. కాగా ఈ కష్ట కాలంలో ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చినందుకు తుర్కియే ప్రభుత్వంతో పాటు ప్రజలు భారత్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్‌లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు. తుర్కియేలో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు.
ఇక సిరియా విషయానికి వస్తే అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో తాజాగా సంభవించిన భూకంపం సహాయ కార్యక్రమాలు సరిగా ముందుకు సాగడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ విపత్తుతో అల్లకల్లోలమైన తుర్కియే, సిరియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా నిలిచింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ సిరియాకు బయల్దేరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.