Afghanistan: ప్రపంచంలో విక్రయిస్తున్న నల్లమందు మొత్తంలో కేవలం ఆఫ్ఘానిస్థాన్ దేశంలోనే 80 శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక వెల్లడించింది. వరల్డ్ మొత్తంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది. ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 3.5 మిలియన్ల మంది ప్రజలు మాదకద్రవ్యాలు వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
కాగా ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదికలోని అంశాలను తాలిబన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తోసిపుచ్చారు. ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదికలోని అంశాలు అన్నీ సరైనవి కాదని ఆయన పేర్కొన్నారు.
గసగసాల సాగు అధికం(Afghanistan)
అఫ్ఘానిస్థాన్ దేశంలో గసగసాల సాగు, డ్రగ్స్ ఉత్పత్తి, రవాణా చేయడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ ఉంటేనే దీన్ని నివారించవచ్చని రాజకీయ విశ్లేషకులు వైస్ నసేరి చెప్పారు. ఆఫ్ఘాన్ దేశంలో నల్లమందు తయారీకి వాడే గసగసాల సాగు గత ఏడాది కంటే 32 శాతం పెరిగింది. దేశంలో 2,33,000 హెక్టార్లలో గసగసాల సాగు అవుతోందని నివేదిక నిగ్గు తేల్చింది.
అప్ఘాన్ దేశం నుంచే 80 శాతం నల్లమందు ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అఫ్ఘాన్ దేశంలోని హిల్ మండ్, కాందహార్, బద్గీస్, ఉరుజ్ గాన్, ఫరా, నంగార్ హర్, నిమ్రోజ్, ఫర్యాబ్ ప్రాంతాల్లో గసగసాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
నల్లమందుతో పాటు అఫ్ఘాన్ నుంచి 350 నుంచి 580 టన్నుల హెరాయిన్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నల్లమందు, హెరాయిన్ డ్రగ్స్ ఉత్పత్తి, విక్రయం, ఎగుమతి అఫ్ఘాన్ దేశంలో అధికంగా సాగుతుందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి విడుదల చేయడం చాలా సంచలనంగా మారింది.