Pakistan: భారీ వరదలకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. అయితే, గూడు చెదిరిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కొందరికి ఓ హిందూ దేవాలయం అక్కున చేర్చుకుంది. చుట్టుపక్కల ప్రాంతమంతా వరదల్లో మునిగిపోగా, ఆ గుడి మాత్రం వరదబారిన పడకపోవడం గమనార్హం. 200-300 మందికి ఆ ఆలయం ఆశ్రయమిస్తోంది. కాగా అందులో ఆశ్రయం పొందుతున్నవారిలో ఎక్కువ మంది ముస్లింలే కావడం విశేషం.
కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ అనే చిన్న గ్రామంలో బాబా మదోదాస్ ఆలయం ఉంది. వరదల కారణంగా నారీ, బోలన్, లెహ్రీ నదులు ఉప్పొంగడంతో ఈ గ్రామం ఇతర ప్రావిన్స్‌ల నుంచి సంబంధాలను కోల్పోయింది. అయితే, భారీ వరదలు వచ్చినప్పటికీ, మదోదాస్ ఆలయం మాత్రం ముంపునకు గురికాలేదు. ఈ నేపథ్యంలోనే వరద బాధిత ప్రజల సహాయార్థం స్థానిక హిందూ సమాజం ఆ ఆలయ ద్వారాలు తెరిచింది. దీంతో ఆ హిందూ ఆలయంలో కులమతాలకు అతీతంగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో మత చాందసవాదులు తరచూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. దేశ విభజన జరిగినప్పుడు 26 శాతం ఉన్న హిందువులు ప్రస్తుతం ఒక శాతం కూడా లేరు. తరచూ హిందు మైనర్ బాలికలను అపహరించి వారితో బలవంతంగా మత మార్పిడులు చేయించి పెళ్లి చేయిస్తున్న సంఘటన కొకొల్లలు. అదే హిందూ దేవాలయం, హిందువులు ప్రస్తుతం వరదలతో బిక్కు బిక్కుమంటున్న ముస్లింలను ఆదుకుంటున్నారు. ఇప్పటికైనా మైనార్టీపట్ల ముస్లింలు తమ వైఖరి మార్చుకోవాలని స్థానిక హిందువులు కోరుతున్నారు.