Hajj Pilgrims: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కా మదీనాలో పరిస్థితులు ఈ ఏడాది దారుణంగా తయారయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 52 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు హజ్ యాత్రికులు సుమారు 550 మంది కంటే ఎక్కువ మందే మృత్యువాతపడ్డారు. సౌదీ అరేబియాలో ఎండలు నిప్పులు కురిపిస్తోందని అరబ్ దేశాలకు చెందిన రాయబారులు చెప్పారు. ఈజిప్షియన్స్‌కు చెందిన సుమారు 323 మంది పౌరులు ఎండవేడిమి తట్టుకోలేక జబ్బుపడి చనిపోయారని ఇద్దరు అరబ్ దేశానికి చెందిన రాయబారులు తెలిపారు.
51 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రత..(Hajj Pilgrims)
ఈజిప్ట్‌కు చెందిన పౌరులు వడదెబ్బకు పెద్ద మొత్తంలో చనిపోగా.. వారిలో ఒకరు మాత్రం రద్దీ పెరిగిపోవడంతో తోపులాటలో నలిగి గాయపడి చనిపోయారని అరబ్ రాయబారి వివరించారు. కాగా మృతుల సంఖ్య విషయానికి వస్తే ఆస్పత్రుల నుంచి ఆస్పత్రి శవాగారాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే ఈ సంఖ్య చెబుతున్నట్లు వారు తెలిపారు. ఇక చనిపోయిన వారిలో జోర్డాన్‌కు చెందిన పౌరులు సుమారు 60 మంది వరకు ఉంటారు. కాగా గత మంగళవారం నాడు 41 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. తాజాగా చూస్తే అన్నీ దేశాలకు చెందిన పౌరులు సుమారు 557 మంది వరకు ఉంటారని సౌదీ అధికారులు తెలిపారు.
ఈద్ ఉల్ అదా లేదా బక్రీద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు .. ముస్లింల పవిత్ర స్థలం అయిన మక్కా, మదీనాను సందర్శించుకుంటారు. అయితే ఈ ఏడాది ఇక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దశాబ్ది కాలంలో ఎన్నడూలేని విధంగా సోమవారం నాడు మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో పగటి ఉష్ణోగ్రత 51.8 డిగ్రల సెల్సియస్ దాటిపోయిందని సౌదీ నేషనల్ మెటోరాలజీ సెంటర్ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈజిప్ట్ విదేశాంగమంత్రిత్వశాఖ మంగళవారం నాడు కైరోలో మాట్లాడుతూ.. హజ్‌యాత్రలో తప్పిపోయిన వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
ఇదిలా ఉండగా సౌదీ అరేబియా అధికారులు వడదెబ్బకు సొమ్మసొల్లిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందిస్తోంది. అయితే వారిలో ఎంత మంది మృతి చెందారనే విషయం మాత్రం బహిరంగంగా వెల్లడించలేదు. గత ఏడాది కూడా ఎండ దెబ్బకు 240 మంది చనిపోయారు. వారిలో మెజారిటీ ప్రజలు ఇండోనేషియాకు చెందిన వారని తేలింది. ఇదిలా ఉండగా తీర్థయాత్రకు వచ్చిన వారు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తలపై మంచినీరు పోసుకుంటూ కనిపించారు. అలాగే చాక్లెట్లు, ఐస్ క్రీంలు తిని ఎండ నుంచి కాస్తా ఉపశమనం పొందుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు హజ్‌కు వచ్చిన యాత్రికులు గొడుగులు, పుష్కలంగా మంచినీరు తాగాలని, ఎండలో ఎక్కువగా తిరగరాదని అధికారులు సూచించారు. కాగా ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా 18 లక్షల మంది మక్కా, మదీనాను సందర్శించుకోగా.. వారిలో 16 లక్షల మంది విదేశీ యాత్రీకులేనని సౌదీ అధికారులు వివరించారు.