Gaza Fuel Crisis: ఇంధన సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో దెబ్బతిన్న గాజా ఆసుపత్రులలోని ఇంక్యుబేటర్లలో 120 నవజాత శిశువుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని యునైటెడ్ నేషన్స్ పిల్లల ఏజెన్సీ ఆదివారం హెచ్చరించింది. ఇంధనం లేకపోవడం వల్ల ఈ శిశువులు చనిపోయే ప్రమాదం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాలో 50,000 మంది గర్భిణీ స్త్రీలు..(Gaza Fuel Crisis)
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం గాజాలో ప్రతిరోజూ 160 మంది మహిళలు ప్రసవిస్తున్నారు. 2.4 మిలియన్ల జనాభా ఉన్న ఈ భూభాగంలో 50,000 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని అంచనా. .గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇప్పటికే 1,750 మందికి పైగా పిల్లలు మరణించారు. గాజా మిలిటెంట్లు మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో రెండు వారాలకు పైగా గాయపడిన వేలాది మందికి మాత్రమే కాకుండా సాధారణ రోగులు కూడా ఉన్న ఆసుపత్రులు మందులు, ఇంధనం మరియు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. మాకు ప్రస్తుతం 120 మంది నవజాత శిశువులు ఇంక్యుబేటర్లలో ఉన్నారు. మేము చాలా ఆందోళన చెందుతున్నామని యునిసెఫ్ ప్రతినిధి జోనాథన్ క్రిక్స్ అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో పలువురు గర్భిణీ స్త్రీలు చనిపోయారు. ప్రతి రోజు తల్లిదండ్రులు తెల్లటి బట్టల్లో శిశువుల మృతదేహాలను మోసుకు వెళ్లడం చూడవచ్చని వారు చెబుతున్నారు. కొన్ని గంటల ముందు, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మంది పిల్లలు మరణించారని నివేదికలు తెలిపాయి.
నవజాత శిశువులు మాత్రమే కాకుండా ప్రీమెచ్యూర్ శిశువులు కూడా ఈ ఆసుపత్రుల్లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగాలంటే ఇంధనం ప్రధాన అవసరం. అయితే ఈ ఇంధనం కొరతతో రోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. శనివారం ఇరవై సహాయ ట్రక్కులు ఈజిప్ట్ నుండి గాజాలోకి ప్రవేశించాయి. కాని వాటిలో ఇంధనం లేదు.ఇంధనం హమాస్‌కు సహాయపడగలదని ఇజ్రాయెల్ భయపడుతుండటంతో సరఫరాను అడ్డుకుంటోంది.