Summer Hair care: వేసవి కాలంలో చర్మాన్ని రక్షించేందుకు తీసుకునే జాగ్రత్తలు జుట్టు విషయంలో తీసుకోరు చాలామంది. అయితే ఎండాకాలంలో వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్ల సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఈ వేడి నుంచి రిలీఫ్ మనం ఉపయోగించే ఏసీలు, కూలర్ల వల్ల జుట్టు నిర్జీవమై పోతుంది. అందుకే ఈ కాలంలో కురుల సంరక్షించుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి, వేసవిలో జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
జుట్టు రాలడం కంట్రోల్ అవ్వాలంటే..(Summer Hair care)
పావు కప్పు తేనెను సన్నని మంటపై గోరువెచ్చగా వేడి చేయాలి. దీనికి పావు కప్పు ఆలివ్ నూనెను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకుని వేడి నీటిలో ముంచిన టవల్‌తో చుట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ పేస్ట్ లో ఆలివ్ ఆయిల్ బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడొచ్చు. ఈ హెయిర్ ప్యాక్ వల్ల పొడిబారిన జుట్టు తిరిగి మెరిసిపోతుంది.
బయట ఎండలు మండిపోతున్నాయి. దీంతో జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లడం లాంటి సమస్యలతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఈ సమస్యకు ఉసిరితో చెక్ పెట్టొచ్చు. కొన్ని ఉసిరి కాయలను తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ముద్దను కుదుళ్లకు పట్టించి కాసేపు మృదువుగా రుద్దాలి. తర్వాత తక్కువ తీవ్రత ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. కాగా, ప్రతిసారీ తలస్నానానికి ముందు ఈ మాస్క్ వేసుకోవడం జుట్టు రాలే సమస్య కంట్రోల్ అవుతుంది.
జుట్టుకు పోషణ అందేందుకు
ఒక గిన్నెలో స్పూన్ నిమ్మరసం, ఎగ్ లోని రెండు పచ్చ సొనలు, 1 తెల్లసొన, స్పూన్ తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తలకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కోడిగుడ్డు జుట్టుకు పోషణ అందిస్తుంది. జుట్టు కోల్పోయిన తేమను తేనె అందిస్తుంది.
అరకప్పు మినప్పప్పుకి ఒక స్పూన్ మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి అర కప్పు పెరుగు కలపాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. మెంతులు వెంట్రుకల చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తాయి. మినప్పప్పు జుట్టు కుదుళ్లు బలంగా చేయడంతో పాటు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటంతో పాటు పొడిబారే సమస్య దరిచేరదు.