Oily Skin Care: కొంతమందికి ఏ కాలంలో నైనా చర్మం జిడ్డుగా మారుతుంది. అదే వేసవి కాలంలో అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని క్రీములు రాసినా.. ముఖంపై ఆ జిడ్డు ఇంకా పేరుకుపోతుంది. దీంతో మేకప్ వేసుకున్న కాసేపటికే ముఖం మళ్లీ కాంతి కోల్పోతుంది. ఇలాంటి సమస్యకు ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది.
పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జిడ్డుదనాన్ని దూరం చేస్తాయి. ప్రతి రోజూ రాత్రిపూట స్పూన్ పసుపులో కొన్ని పాలు పోసి.. మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. కాసేపు తర్వాత కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.
నిమ్మరసంతో(Oily Skin Care)
జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లకు నిమ్మరసం చక్కగా పని చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై మురికి పోయి శుభ్రపడుతుంది. తేమ కూడా అందుతుంది. జిడ్డు కూడా పేరుకోకుండా ఉంటుంది.
విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే వాటిల్లో టమాటా ఒకటి. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు టమాటా ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. పావు గంట అయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం ప్రెష్ గా మారుతుంది. జిడ్డు కూడా తొలగిపోతుంది.
ముఖం కడిగిన వెంటనే మొక్కజొన్న పిండిలో.. నీళ్లు కలిపి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూత వేసుకున్న తర్వాత మేకప్ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.
కాలానికి అనుగుణంగా లోషన్స్
ఎలాగూ చర్మం జిడ్డుగానే ఉంటుందని వేసవిలో మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ అది తప్పు. కాలానికి అనుగుణమైన ఉత్పత్తులను ఎంచుకొని వాటిని ఉపయోగించాలి. లేదంటే చర్మం ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బాగా పండిన అరటిపండు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో రెండు స్పూన్స్ ఓట్స్, స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ను ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఆహారం పై శ్రద్ధ
కీరాదోస రసం, నిమ్మరసం కొద్దిగా తీసుకుని బాగా కలపాలి. అందులో కొంచెం పసుపు కూడా వేసి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల సేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం తాజాగా ఉంటుంది.
ఎన్ని ప్యాక్ లు వేసుకున్నా సరే.. వేసవిలో తీసుకునే ఆహారం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. నూనె పదార్థాలు అధికంగా తీసుకుంటే సమస్య మరింత ఎక్కువచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.