Dehydration: బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతలు అధికంగా ఉన్నాయి. దీంతో చెమట రూపంలో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్తుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది కాబట్టి తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే శరీరంలోని నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ కు గురవుతారు. అదే విధంగా ఎక్కువసేపు శరీరంలో నీటి శాతం తగ్గితే కాలేయం, కీళ్లు, కండరాలకు చిక్కులు వస్తాయి. మరో వైపు రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలూ పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
స్టడీలో ఏముంది?(Dehydration)
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్‌ను రిలీజ్ చేస్తుంది. మరో వైపు రక్తంలో నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియా తక్కుతుంది. ఎక్కువగా నీరు తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతున్నట్టు, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. నీటికి, కొలెస్ట్రాల్ స్థాయిలకు మధ్య సంబంధం ఏంటి అనేది కచ్చితంగా తెలియ రాలేదు. కానీ తగినంత నీరు తాగితే మాత్రం కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చని స్టడీలు సూచిస్తున్నాయి. అందువల్ల శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవడం మంచిది. అదీ కూడా ఎండాకాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో కూడా మార్పులు
అదే విధంగా నీరు తాగడం తో పాటు తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే ఓంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలూ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి.
చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గటానికి ఉపయోగపడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. కాబట్టి కొవ్వుతో ఉండే సాల్మన్, టూనా, సారడైన్ లాంటి చేపలను తరచూ తీసుకోవడం మంచిది. నూనెలో వేయించకుండా తీసుకునేలా చూడాలి. అంతేకాకుండా పొట్టుతీయని ధాన్యాల తోడు, గింజపప్పులు, పొద్దు తిరుగుడు, వేరుశెనగ, ఆలివ్ నూనెల లాంటి అసంతృప్త కొవ్వులు తీసుకోవడం మేలు చేస్తాయి.
వ్యాయామం, విశ్రాంతి తప్పనిసరి
కనీసం రోజులో అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గటానికి ఉపయోగపడుతుంది. వేగంగా నడవటం, గుండెకు పని చెప్పే వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బు, పక్షపాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువు కూడా తగ్గుతుంది.
ఆహారం, వ్యాయామం తో పాటు శరీరానికి రెస్ట్ కూడా అవసరం. అదే పనిగా ఒత్తిడికి గురి అయితే రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి తగినంత విశ్రాంతి కూడా అవవసరం. నెమ్మదిగా, గట్టిగా శ్వాస తీసుకోవడం, ధ్యానం, నలుగురితో మాట్లాడటం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి.