Chronic Headaches: మనలో చాలామంది తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. దానికి కారణాలు లేకపోలేదు. మారని లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, సరిపడా నిద్ర పోకపోవడం, శరీరానికి కావాల్సిన రెస్ట్ దొరకకపోవడం లాంటి కారణాలతో తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి భరించలేనంతగా తలనొప్పి వస్తుంది. దానిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే భవిష్యత్ తో దాని ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి తరచూ వచ్చే తలనొప్పికి ఇంట్లో దొరికే వాటితో రిలీఫ్ పొందొచ్చు.
ఇపుడు ప్రతి ఇంట్లో అల్లం ముక్క అందుబాటులో ఉంటుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఎక్కువగా తలనొప్పి తో బాధపడే వారు.. అల్లం రసాన్ని ఒక స్పూన్లో వేసి తాగినా తలనొప్పి తగ్గుతుంది. గోరువెచ్చగా అల్లం టీ తీసుకుని మెల్లగా తాగడం వల్ల తలనొప్పి కలిగించే రక్తనాళాల్లో ఉపశమనం కలుగుతుంది. జలుబు, జ్వరంతో పాటు తలనొప్పి వచ్చినప్పుడు కూడా వేడి నీటిలో అల్లం రసం, నిమ్మరసం, ఎండుమిర్చి కూడా వేసి ఆవిరి పడితే ఆ సమస్య తగ్గుతుంది.
దాల్చిన చెక్కను రోజువారీ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాము. సాధారణంగా రోజూ తాగే టీలో లేదా ఏదైనా పానీయాల్లో దాల్చిన చెక్క పౌడర్ కలుపుకుని తాగితే తలనొప్పి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా దాల్చిన చెక్క పొడిని నీటిలో గానీ , గంధంలో గానీ కలిపి నుదుటిపై రాసుకున్నా కూడా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. దాల్చిన చెక్కలో శక్తివంతమైన ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని నుంచి వచ్చే వాసన కూడా నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. తలనొప్పిగా అనిపించినప్పుడు దాల్చిన చెక్క పేస్టును నుదుటిపై రాసుకుని ఓ అరగంట నిద్రపోవాలి. లేచాక గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నాన్‌వెజ్ వంటకాలను మంచి రుచిని తేవాలంటే లవంగాలతోనే సాధ్యం. లవంగాలు లేని బిర్యానీని ఊహించగలమా. అయితే, ఈ మసాలా దినుసు కూడా తలనొప్పిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులు, లవంగాలు కలిపిన రసం తాగితే ఎంతో మంచిది. లవంగాలు, పుదీనా ఆకుల పేస్టును తలపై రాసుకుంటే రక్తనాళాల్లో మంట తగ్గుతుంది. తద్వారా నొప్పి కూడా తగ్గుతుంది. జలుబు, దగ్గు వల్ల కూడా ఒక్కోసారి తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటపుడు లవంగాల నుంచి వచ్చిన వాసనను పీల్చడం వల్ల కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.