Tollywood Producer Mahendra Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత కె.మహేంద్ర(79) అర్ధరాత్రి 12 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన ఏఏ అర్ట్స్ అధినేతగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆయననను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది.
గుడివాడలోని దోసపాడులో 1946 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించిన మహేంద్ర.. డైరెక్షన్‌లో శిక్షణ పొంది ప్రొడ్యూసర్‌గా అవతారం ఎత్తారు. తొలుత ఆయన ప్రత్యగాత్మ, హేమాంబరధరావులతో అసిస్టెంట్ గా చేశారు. ఆ తర్వాత ప్రొడక్షన్ కంట్రోలర్ గా చాలా సినిమాలకు పనిచేశారు.
1977లో తొలిసారి ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ సినిమాతో ప్రొడ్యూసర్ గా చేశారు. ఈ సినిమా మంచిగా హిట్ కావడంతో వరుసగా ‘ఏది పుణ్యం, ఏది పాపం’ సినిమా చేశారు. అలాగే ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందీపోటు రుద్రమ్మ’, ‘ఎదురు లేని మొనగాడు, ‘డాకురాణి, ‘కనకదుర్గ వ్రత మహాత్యం’, ప్రచండ భైరవి, శ్రీహరితో ‘పోలీస్’, ‘దేవా’ సినిమాలు చేశాడు.