Site icon Prime9

Tollywood : టాలీవుడ్‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు… ప్రముఖ నటుడు జనార్ధన్ మృతి

telugu-actor-vallabhaneni-janardhan-passed-away

telugu-actor-vallabhaneni-janardhan-passed-away

Tollywood : తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది లోనే టాలీవుడ్ కి పెద్ద దిక్కులాంటి రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణలు తుదిశ్వాస విడిచి ఒక శఖానికి ముగింపు పలికారు. ఆ విషాదం నుంచి టాలీవుడ్ కోలుకునే లోపే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు రోజుల వ్యవధి లోనే మృతి చెందడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి మరింత కుంగిపోయింది. కాగా ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ నటుడు ఈ లోకాన్ని వీడడం అందరినీ కలచి వేస్తుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు.

అనారోగ్యం కారణంగా అపోలో లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు జనార్ధన్ కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో జన్మించారు. ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్దన్ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉండగా… మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతుండగా… అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

సినిమాపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మామ్మగారి మనవలు అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కన్నడలో హిట్ అయిన మానససరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్ బాబు హీరోగా తోడు నీడ చిత్రాన్ని నిర్మించారు. తన కూతురు శ్వేత పేరు మీద శ్వేత ఇంటర్నేషన్ సంస్థను స్థాపించి శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు చిత్రాలను రూపొందించారు. తన మామ విజయబాపినీడుతో కలిసి మహాజనానికి మరదలు పిల్ల చిత్రాన్ని నిర్మించారు.

జనార్ధన్ కు చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఆ మూవీలో సుమలత తండ్రి పాత్రలో జనార్దన్ నటన అందరినీ మెప్పించింది. దాదాపు 100కు పైగా సినిమాలలో నటించిన జనార్థన్ బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’… నాగార్జునతో ‘వారసుడు’ … వెంకటేశ్ తో ‘సూర్య ఐపీయస్’లో నటించారు. సినిమాల్లోనే కాకుండా ‘అన్వేషిత’ అనే సీరియల్ లోనూ జనార్ధన్ నటించి మెప్పించారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. జనార్ధన్ అంత్యక్రియల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version