Supreme Court Grant of anticipatory bail to Telugu actor Mohanbabu: తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో ఉన్న తన ఇంటి విషయంలో కుటుంబంతో జరిగిన విభేదాల్లో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన మోహన్ బాబు మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నాడు. అనంతరం అదే మైక్‌తో అతడిపై దాడికి చేశారనే అభియోగంపై కేసు నమోదైంది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్ 23న ఈ కేసును కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా, ఈ కేసు విషయంపై విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా, దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజీత్‌ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారని విచారణలో మోహన్ బాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జర్నలిస్ట్‌కు ఆర్థిక సాయం కూడా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని కోర్టుకు వివరించారు. అయితే సీసీటీవీ పుటేజీ లేకుండా చేశారని, ఇంటికి వస్తే వారిపై దాడి జరిగిందని, విచారణకు కూడా వెళ్లలేదు కదా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు లాయర్ సమాధానం ఇచ్చారు.
అలా వ్యవహరించలేదని, ఈ సమస్య పూర్తిగా కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబుకు ప్రాపర్టీ ఉందని, ఆయనకు, ఆయన కుమారుడికి మధ్య కుటుంబ వివాదమే తప్పా మరే విషయం కాదని, బయటి వ్యక్తులకు సంబంధం లేదని వివరించారు. అయితే యూనివర్సిటీ, విద్యాసంస్థలకు సంబంధించిన అంశమే తప్పా మేమీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కోర్టు గాయపడిన జర్నలిస్టు రంజీత్ ఆరోగ్యం గురించి అడిగింది. ఈ మేరకు జర్నలిస్టు తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం.. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.