Site icon Prime9

Rajini Kanth : ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు.. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన కింగ్ – రజినీకాంత్

super star rajini kanth shocking comments about ntr

super star rajini kanth shocking comments about ntr

Rajini Kanth : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సభలో తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను పంచుకుంటూ అప్పటి మధుర జ్ఞాపకాలెన్నింటినో ఈ వేదికగా సూపర్ స్టార్ నెమరువేసుకున్నారు. అదే విధంగా ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెదేపా నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

తెలుగులోనే ప్రసంగించిన రజనీకాంత్.. చాలారోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నానని, తన తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోందని, కానీ, రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని తన మనసులో మాట వెల్లడించారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చినట్టు రజినీకాంత్ తెలిపారు. ఎన్టీఆర్‌ తను ఎంతో ప్రభావితం చేశారని తెలిపారు. తాను ఆరేళ్ల వయసులో మొదటి సినిమా చూశానని తెలిపిన సూపర్ స్టార్.. అది ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి అని చెప్పారు. ఇదే సమయంలో.. తాను హీరోగా చేసిన మొదటి సినిమా పేరు కూడా భైరవి అని గుర్తు చేశారు. ఆ సినిమా డైరెక్టర్ సినిమా కథ చెప్పినప్పుడు.. పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నట్టు అప్పటి సన్నివేశాన్ని వివరించారు.

తనకు 13 ఏళ్లు ఉన్నప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను డైరెక్టుగా చూశానని గుర్తు చేసుకున్నారు రజినీకాంత్. ఓసారి ఎన్టీఆర్‌ వచ్చినప్పుడు ఆయనను చూసేందుకు వెళ్తే ఎవరో తనను భూజాలపై ఎత్తుకుని చూపించిన విషయాన్ని సూపర్ స్టార్ గుర్తుచేసుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో తాను స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్‌ చేసినట్టు తెలిపారు. కట్ చేస్తే.. 1977లో ఎన్టీఆర్‌తోనే కలిసి టైగర్‌ అనే సినిమాలో చేశానని తెలిపారు. ఆ సినిమాలో షూటింగ్ సమయంలో జరిగిన షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయేవాన్ని అంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్పీడ్ అంటేనే రజినీకాంత్.. రజినీకాంత్ అంటేనే స్పీడ్.. అనేట్టు చేసే తాను.. ఆయన స్పీడ్‌ను అందుకోలేకపోయానంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా.. ఎన్టీఆర్ సినిమా దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని.. గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని చెప్పుకొచ్చారు. దానవీర శూరకర్ణలో దుర్యోదనుడి పాత్రను చేయాలనుకుని.. ప్రొడ్యూసర్‌లను కూడా పట్టుకున్నానని.. అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ను పూర్తిగా రాపించుకుని.. ప్రాక్టీస్ కూడా చేశానని తెలిపారు. అయితే.. ఎన్టీఆర్‌లా మేకప్ వేసుకుని ఫొటో దిగి తన స్నేహితుడికి చూపిస్తే.. కోతిలా ఉన్నానని వేషం అస్సలు సెట్ కావని ముఖం మీదే చెప్పినట్టు తెలిపారు. దీంతో.. ఆ పాత్ర చేయకుండానే విరమించుకున్నట్టు వివరించారు. ఆ మహానుభావుడికి ఎంతో క్షమశిక్షణ ఉండేదని.. ఆయన సినిమాల్లోనే కింగ్ కాదు.. రాజకీయాల్లోనూ, బయట ఆయనే కింగ్ అని తెలిపారు రజినీకాంత్. ప్రస్తుతం రజినీ చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version