Costumes Krishna : టాలీవుడ్ లో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ.. ఈమధ్యే కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన స్వగృహంలోనే ఈరోజు (ఏప్రిల్ 2 ) కన్ను మూశారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, విశ్వనాథ్, జమున, కైకాల.. ఇలా ఎంతో మంది నటీనటులు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. తాజాగా మరో నటుడు తుదిశ్వాస విడవడం పట్ల టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
కాస్ట్యూమ్స్ కృష్ణ పూర్తి పేరు మాదాసు కృష్ణ. స్వస్థలం విశాఖపట్నం. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన ఆయన.. కాస్ట్యూమర్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన ఆయన నటుడిగా, నిర్మాతగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి సేవలందించాడు. కోడి రామకృష్ణ దర్వకత్వంలో నటుడిగా పరిచయం అయ్యాడు. కాస్ట్యూమ్స్ కృష్ణకు నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
పలువురు ప్రముఖులు ఆయన మరణానికి చింతిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశాడు. కాస్ట్యూమ్ కృష్ణ గారి మరణ వార్త చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
Sad to hear about Costumes Krishna Garu’s demise. Condolences to his family members. You will be missed. RIP… pic.twitter.com/m86Zr57Hjt
— Sri Venkateswara Creations (@SVC_official) April 2, 2023
తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. ఆయన 1954లో మద్రాస్ వెళ్ళిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పని చేశారు. ఆ సమయంలో ఆయన్ను ‘సురేష్’ కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘పెళ్ళాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్ళు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపిఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ తదితర సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అనేక పాత్రలతో మెప్పించారు.
నిర్మాతగానూ..
జగపతిబాబు హీరోగా తెరకెక్కిన పెళ్లిపందిరి సినిమాతో నిర్మాతగా కూడా మారారు. మొత్తం 8 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ‘అశ్వత్థామ’ సినిమాకూ ఆయనే నిర్మాత. కన్నడలో విజయవంతమైన ఓ సినిమా రీమేక్ రైట్స్ కొని ‘అరుంధతి’ పేరుతో కాస్ట్యూమ్స్ కృష్ణ రీమేక్ చేశారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 36 లక్షలకు ‘దిల్’ రాజు కొన్నారు. అయితే, విడుదలకు ముందు రూ. 34 లక్షలే ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే నాలుగు రోజుల్లో మరో రూ. 2 లక్షలు ‘దిల్’ రాజు ఇవ్వడంతో కాస్ట్యూమ్స్ కృష్ణ ఆశ్చర్యపోయారు. అందుకని, ఆ తర్వాత తాను నిర్మించిన ‘పెళ్లి పందిరి’ సినిమాకు చాలా మంది డబుల్ రేట్ ఆఫర్ చేసినా సరే.. ‘దిల్’ రాజుకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు. అలా వారి మధ్య అప్పటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీ హైదరాబాద్ షిప్ట్ అయిన తరువాత ఆయన సినిమాలు మానేశారు.