Shaakuntalam Movie : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన చిత్రం “శాకుంతలం“. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నుంచి ప్రేరణ పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తీశారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించగా.. అల్లు అర్జున్ ల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో, పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి షో నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
అయితే థియేటర్లలో ఆడియన్స్ ని ఈ మూవీ మెప్పించలేకపోయినప్పటికి.. అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు న్యూయార్క్ ఇంటర్నేషన్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023 లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ గా అవార్డులు దక్కించుకుంది. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు ఈ మూవీని వరించింది. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ఈ సినిమాకు ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్.. బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్.. బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ విభాగాల్లో ఈ చిత్రానికి (Shaakuntalam Movie) అవార్డులు దక్కాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గుణటీమ్ వర్క్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
కాగా థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాక ముందే ‘శాకుంతలం’ సినిమా ఓటీటీ లోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషలలో స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మే 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకు నాలుగు అవార్డులు రావడం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది చిత్ర బృందానికి అభినందనలు చెప్తుంటే, మరికొంత మంది ఈ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.