Site icon Prime9

Sivaji: మంగపతి.. అబ్బబ్బా ఏమన్నా నటించాడా.. ఆ అరుపులకు థియేటర్లు బద్ధలవుతున్నాయి

Sivaji: నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ నెమ్మదిగా సెకండ్ హీరోగా మరి.. ఆతరువాత హీరోగా సినిమాలు చేస్తూ పైకి వచ్చాడు. స్టార్ అని చెప్పలేము కానీ, శివాజీ సినిమాలకు కూడా ఫ్యాన్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల మీద మక్కువతో పొలిటికల్ సెటైర్స్ వేసి ఎన్నో వివాదాలకు తెరలేపాడు. అలా కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.

 

ఇక ప్రతిఒక్కరికి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సినిమాలు, రాజకీయాలు అన్ని వదిలేసి అసలు ఎక్కడ ఉన్నాడో.. ? ఏం చేస్తున్నాడో.. ? కూడా తెలియని శివాజీ.. సర్ ప్రైజ్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో దర్శనమిచ్చాడు.  పెద్దన్న శివన్నగా శివాజీ మైండ్ గేమ్ కు అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ను గెలిపించడానికి శివాజీ పన్నిన పన్నాగాలకు అందరు నోర్లు వెళ్ళబెట్టారు. ఇక అనుకున్నట్లుగానే పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేసి బయటకు వచ్చాడు శివాజీ.

 

బిగ్ బాస్ లో శివాజీ ఉన్నప్పుడే ఆయన నటించిన #90’S వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.  ఇక శివాజీ పేరు అక్కడ బిగ్ బాస్ లో ఇక్కడ సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. సాధారణంగా తెలుగులో బిగ్ బాస్ నుంచి వచ్చిన వారెవరికీ కూడా ఆ షో చేసింది ఏమి లేదు. గుర్తింపు తెచ్చుకుంటామని వెళ్లి.. ఆ తరువాత అసలు వారు ఏమవుతున్నారో కూడా తెలియడం లేదు. శివాజీని కూడా అలాగే అనుకున్నారు.

 

అయితే శివాజీ మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. వచ్చిన గుర్తింపును ఏ సినిమాలు పడితే ఆ సినిమాల కోసం వాడకుండా తనకు ఇంకా గుర్తింపును తీసుకొచ్చే పాత్రల కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అలా ఇన్నాళ్లు వేచిన  ఎదురుచూపులు ఫలించి కోర్ట్ సినిమా శివాజీ చెంతకు వచ్చి చేరింది. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో మంగపతిగా శివాజీ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

 

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏనోబడీ. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. ప్రియదర్శి కీలకపాత్రలో నటించాడు. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా  అనౌన్స్ చేసే సమయంలో ఇది నాని సినిమా అన్నారు. ఆ తరువాత సాంగ్ వచ్చినప్పుడు ఇద్దరు ప్రేమికుల కథ అన్నారు. ఇక ట్రైలర్ లో ప్రియదర్శి  వాదనలు విని..  వకీల్ సాబ్ రేంజ్ అనుకున్నారు. కానీ, సినిమా చూసాకా అందరి నోటా నుంచి ఒకటే మాట. ఇది మంగపతి  వన్ మ్యాన్ షో. శివాజీ సినిమా అని చెప్పుకొస్తున్నారు. అంతలా ఆ క్యారెక్టర్ లో శివాజీ జీవించేశాడు.

 

అసలు కోర్ట్ కథ ఏంటి అంటే.. 19 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ అలియాస్ చందు ఇంటర్ ఫెయిల్ అయ్యి రకరకాల జాబ్ లు చేస్తూ ఉంటాడు. అతడికి జాబిల్లి అనే 17 ఏళ్ళ అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. జాబిల్లి మామ మంగపతి. పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి. జాబిల్లి తండ్రి చనిపోతే వారి కుటుంబానికి పెద్దగా పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇక చందు- జాబిల్లి ప్రేమ విషయం మంగపతికి తెలియడంతో.. తన ఫ్రెండ్ అయిన దాముతో చందుపై లేనిపోని కేసులు పెట్టిస్తాడు. అందులో పోక్సో ఒకటి.  ఈ చట్టం వచ్చిన ఏడాది తరువాత ఈ కేసు జరిగినట్లు చూపించారు. కోర్టు లో చందుకు సపోర్ట్ గా ఏ లాయర్ వచ్చినా మంగపతి ముందు నిలువలేక వెళ్ళిపోతారు. చివరికి చందు కేసును జూనియర్ లాయర్ అయిన సూర్య తేజ వాదించడానికి ఒప్పుకుంటాడు. మరి సీనియర్ లాయర్ అయిన దాము ముందు సూర్య తేజ గెలిచాడా.. ? మంగపతి ప్లాన్ ఏంటి.. ? చివరకు చందు నిర్దోషిగా బయటకు వచ్చాడా.. ? అనేది సినిమా చూడాల్సిందే.

 

చట్టాలను డబ్బున్నవారు.. డబ్బుతో కొని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు.. ? దీనివలన అమాయకులు ఎలా ఇబ్బందిపడుతున్నారు అనేది చూపించారు. పరువు, కులం అంటూ పాకులాడే మంగపతిగా శివాజీ నటన నెక్స్ట్ లెవెల్. సినిమాకు ఆయనే హైలైట్. ఆయన అరుపులకు అయితే థియేటర్ లో బాక్సులు బద్దలు అవుతున్నాయి. మంగపతి క్యారెక్టర్ శివాజీ కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ముందు ముందు శివాజీ ఇలాంటి పాత్రలతో మెప్పిస్తాడా.. ? లేదా విలక్షణ నటుడిగా మారతాడా.. ? అనేది చూడాలి.

Exit mobile version
Skip to toolbar