Site icon Prime9

Vijay Rangaraju: సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ నటుడు విజయ్‌ రంగరాజు మృతి

Vijaya Rangaraju Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్‌ రాజ్‌ కుమార్‌ (Vijay Rangaraju) మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం గుండెపొటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, ఫైట్‌ మాస్టర్‌గా, ఫైటర్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో షూటింగ్‌లో గాయపడ్డ ఆయన చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. 1994లో నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమాతో తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ విలన్‌ పాత్రలు పోషించిన ఆయన అన్ని భాషల్లో కలిపి 5వేలకు పైగా సినిమాల్లో నటించారు. పూణెలో పుట్టిన ఆయన ముంబైలో పెరిగారు. పోలీసులు కావాలనుకున్న ఆయన అనుకోకుండ సినిమాల్లోకి వచ్చినట్టు గతంలో ఎన్నో ఇంటర్య్వూలో పేర్కొన్నారు.

రంగస్థల నటుడిగా కెరీర్ స్టార్ట్

చెన్నైలో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించిన ఆయన ఆ తర్వాత సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ చిత్రంతో ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదే ఆయన మొదటి సినిమా. అయితే అత‌డికి గుర్తింపును ఇచ్చింది మాత్రం భైరవ ద్వీపం సినిమానే. దీంతో భైరవ దీపం విజయ్ అంటూ ఆయనను పలిచేవారు. దీని తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్స్‌ వచ్చాయి. న‌టుడిగా, ఫైట్‌ మాస్టర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన గోపీచంద్ న‌టించిన‌ ‘యజ్ఞం’ సినిమాలో ఆయ‌న విల‌న్‌గా న‌టించ‌డం అత‌డి కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయ‌న చెప్పుకోచ్చారు.

Exit mobile version