Uttara Baokar : ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ మృతి చెందారు. మహారాష్ట్ర లోని పూణె లో నివాసం ఉంటున్న ఆమె చాలా కాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉత్తరా బావోకర్.. మంగళవారం నాడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో.. స్టూడెంట్ గా.. నటనను అభ్యసించిన ఉత్తరా బావోకర్ అనేక నాటకాల్లో తన ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి నాటకంలో పద్మావతి పాత్ర, మేనా గుర్జారి నాటకంలో టైటిల్ రోల్ మేనా పాత్రతో పాటు షేక్స్ పియర్ రచించిన ఒథేల్లో నాటకంలో డెస్టెమోనా పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. సౌత్ లో ప్రముఖ రచయిత గిరీష్ కర్నాడ్ రచించిన తుగ్లక్ నాటకంలో తల్లి పాత్రలో ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మరణం సినీ, నాటక రంగానికి తీరని లోటు అని.. వివిధ నాటకాల్లో ఆమె పోషించిన పాత్రలు జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరా బావోకర్ గోవింద్ నిహ్లానీ చిత్రం తమస్ తో వెండితెరపై వెలుగు లోకి వచ్చారు. బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ సునీల్ సుక్తాంకర్ నిర్మాణంలోనే ఉత్తరా దాదాపు ఎనిమిది సినిమాల్లో పని చేశారు. ఎన్నో వైవిధ్య పాత్రలకు ప్రాణం పోశారు ఉత్తరా బావోకర్. ఇక ఆమె మరణ వార్త తెలిసి.. పలువరు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. బుధవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు.. బందువులు మీడియాకు వెల్లడించారు.