AR Rahman: ఆస్కార్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. ఛాతీ నొప్పి రావడంతో ఏఆర్ రెహమాన్ ను హాస్పిటల్ కు తరలించారని ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. రెహమాన్ కు ఛాతీ నొప్పి రాలేదని, డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారని తెలిపారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటనే ఆయనను డిశ్చార్చ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఇక తాజాగా రెహమాన్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని భార్య సైరా భాను మొదటిసారి మాట్లాడింది. గత కొన్ని నెలల క్రితం రెహమాన్- సైరా భాను విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ” మా వైవాహిక బంధం కొన్నిరోజుల్లో 30 ఏళ్లకు చేరుతుందని ఎంతో ఆశపడ్డాం. కానీ, అనుకోని విధంగా మేము విడిపోవాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి కష్టతరమైన సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి” అని రాసుకొచ్చారు.
ఇక రెహమాన్ విడాకుల వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. రెహమాన్ విడాకులు ఇవ్వడానికి కారణం.. మరో సింగర్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో నిజం లేదని సదురు సింగర్ మీడియా ముందు చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యనే సైరా భాను అనారోగ్యంతో ఉన్నప్పుడు రెహమానే దగ్గరుండి చూసుకున్నాడని సైరా భాను లాయర్ ఒక పోస్ట్ కూడా చేసింది. అప్పటి నుంచి రెహమాన్ మాజీ భార్య మళ్లీ కలవాలనుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా రెహమాన్ ఆరోగ్య పరిస్థితి గురించి సైరా భాను ఒక కీలక ప్రకటన చేసింది. తనను రెహమాన్ మాజీ భార్య అని పిలవద్దు అని కోరింది. ” రెహమాన్ ఛాతీలో నొప్పి వలన హాస్పిటల్ లో చేరినట్లు నాకు తెల్సింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. దేవుని దయ వలన ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అభిమానులు ఆందోళన పడవద్దు.
నా గురించి మాట్లాడేటప్పుడు మాజీ భార్య అని పిలవద్దు. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు. మేము విడాకులు తీసుకోవడానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నా అనారోగ్య సమస్యల వలనే మేము విడాకులు తీసుకోవాలనుకున్నాం. గత రెండేళ్లుగా మేము విడివిడిగా ఉంటున్నాం. నా వలన ఆయనకు ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. మా విడాకుల కేసు ఇంకా కోర్ట్ లోనే ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.