Prime9

Actress Saiyami Kher: తెలుగు సినిమా కోసం కమిట్‌మెంట్‌ అడిగారు – బాలీవుడ్‌ నటి షాకింగ్‌ కామెంట్స్‌

Actress Saiyami Kher Said She Facing Casting Couch in tollywood: కాస్టింగ్ కౌజ్‌.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు. అవకాశాలు కావాలంటే కమిట్మెంట్‌ ఇవ్వాలంటూ ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు వచ్చి చెప్పారు. అయినా కూడా ఇండస్ట్రీలో ఈ పద్దతి మాత్రం మారడం లేదు. ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఎంతోమంది బయటకు రావడంతో అంతా షాక్‌ అయ్యారు.

 

ఇప్పటికీ పలువురు నటీమణలు బయటకు వచ్చి దీనిపై స్పందించారు. తాజాగా మరో నటి మీ టూ ఉద్యమంపై షాకింగ్‌ కామెంట్స్‌. బాలీవుడ్‌ నటి అయిన ఆమె తెలుగు ఇండస్ట్రీపై ఈ కామెంట్స్‌ చేయడంతో అవి హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్‌ ఆరంభంలో టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌజ్‌ను ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ తెలుగు సినిమా ఆఫర్‌ కావాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

 

“నా కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను మంచి సినిమాలు చేశాను. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు 19, 20 ఏళ్ల వయసులో ఓ తెలుగు సినిమా ఆఫర్‌ వచ్చింది. ఒకమహిళా ఏజెంట్‌ నన్ను పిలిచి సినిమా చాన్స్‌ల కోసం ‘సర్దుకుపోవాలి’ అని చెప్పారు. నాకు అర్థమైన అర్థం కానట్టు వ్యవహరించాను. కానీ ఆమె పదే పదే అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. పరిస్థితి అర్థమైంది. ‘క్షమించండి’ అని సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించాను. ఆ సమయంలో నాకు ఈ విషయాన్ని బయటపెట్టంత ధైర్యం లేదు. అందుకే సైలెంట్‌ ఆ మూవీని వదిలేసి నా పని నేను చేసుకుంటూ వెళ్లా.

 

నా కెరీర్‌లో అలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం అదే తొలిసారి, చివరిసారి” అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా సయామీ ఖేర్‌ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె రేయ్‌(2015) సినిమా చేసింది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మిర్జ్యా అనే చిత్రంలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే చోక్డ్‌, ఘామర్‌ వంటి చిత్రాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు పొందింది. ఇక 2021లో నాగార్జున అక్కినేని నటించిన వైల్డ్‌ డాగ్‌ మూవీలో సయామీ కీలక పాత్ర పోషించింది.

Exit mobile version
Skip to toolbar