Tehsildar Suicide: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. రోజూలాగే ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన ఎమ్మార్వో శ్రీనివాస్.. ఆకలేస్తుంది, టిఫిన్ తీసుకు రమ్మని అటెండర్ కు సూచించారు. అటెండర్ తిరిగి వచ్చేసిరి తహసీల్దార్ శ్రీనివాస్ కార్యాలయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టిఫిన్ తీసుకు వచ్చిన అటెండర్ ఎమ్మార్వో ఉరివేసుకొని చనిపోవడాన్ని గుర్తించి షాక్ అయ్యాడు.
వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తహసీల్దార్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచి పదవిలో ఉన్న తమ కుమారుడు.. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని శ్రీనివాస్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. సమగ్రభూసర్వేపై ఇటీవల ఉన్నతాధికారులు మందలించడంతో శ్రీనివాసరావు ఆవేదనకు గురయినట్లు సమాచారం.
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమగ్ర భూసర్వే పేరుతో తనను అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశారు. కానీ కాసేపటికే కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీఆర్వో సంతోష్ చికిత్స పొందుతున్నారు.