Supreme Court Lawyer Killed; ఉత్తరప్రదేశ్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను హత్య చేసినందుకు మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని సోమవారం అరెస్టు చేశారు. నోయిడాలోని తమ బంగ్లాలో ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు అజయ్ నాథ్ ఆదివారం నేరం చేసిన తర్వాత బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో దాక్కున్నాడని పోలీసులు తెలిపారు.
మృతిచెందిన రేణు సిన్హా రెండు రోజులుగా తన సోదరుడు పదే పదే ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనితో ఆందోళన చెందిన ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బలవంతంగా బంగ్లాలోకి ప్రవేశించిన పోలీసులు బాత్‌రూమ్‌లో రేణు మృతదేహాన్ని గుర్తించారు. ఇంతలో, సంఘటన జరిగినప్పటి నుండి కనిపించకుండా పోయిన ఆమె భర్త కనపడకపోవడంతో రేణు సోదరుడు తన బావే సోదరిని హత్య చేసాడని ఆరోపించాడు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని సోదరుడు వెల్లడించాడు.
దీనితో పోలీసులు అతని కోసం వెతకగా బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో దొరికిపోయాడు. అజయ్ నాథ్ బంగ్లాకు తాళం వేసి టెర్రస్‌పై ఉన్న స్టోర్ రూమ్ లో దాక్కున్నాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.విచారణలో, అజయ్ నాథ్ తమ బంగ్లాను రూ. 4 కోట్లకు విక్రయించాలని ప్లాన్ చేశానని, అడ్వాన్స్ కూడా తీసుకున్నానని, అయితే అతని భార్య అమ్మకానికి వ్యతిరేకంగా ఉందని తెలిపాడు. రేణు సిన్హా గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నెల రోజులక్రితం క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.