Noida: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో లైట్లను అమర్చిన ఇనుప స్తంభం ప్రమాదవశాత్తూ మీదపడింది. ఈ ఘటనలో ఓ మోడల్ అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. నోయిడా ఫిల్మ్ సిటీ లోని లక్ష్మీ స్టూడియోల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లైట్ల స్తంభం అదుపు తప్పడంతో
ఫ్యాషన్ షో కోసం ర్యాంప్‌వాక్ పక్కన అమర్చిన లైట్ల స్తంభం అదుపు తప్పడంతో అది ఒక్కసారిగా ర్యాంప్‌పై పడిపోయింది. ఆ సమయంలో 24 ఏళ్ల వన్షికా చోప్రా అక్కడ వాక్ చేస్తోంది. దీంతో ఆ స్తంభం ఆమె మీద పడడంతో తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన వన్షికను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీరాజ్ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఈ ఫ్యాషన్ షో నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.