Cyber Criminals: రోజు రోజుకూ సైబర్ నేరగాళ్ళు ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. పోలీసు శాఖ, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా.. ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఓటీపీ చెప్పడంతో.. (Cyber Criminals)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనిలో నివాసం ఉంటున్నా నూరిళ్ల, రిజ్వనా అనే భార్య భర్తలను సైబర్ నేరగాళ్ళు బురిడీ కొట్టించారు. కొద్ది రోజుల క్రితం నూరిళ్ల, రిజ్వనాకు RBL బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఇది పసిగట్టిన సైబర్ నేరగాళ్ళు.. దంపతులిద్దరికీ ఫోన్ చేసి క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేయాలనీ.. ఓటిపి చెప్పాలని నమ్మబలికారు. దీంతో తమ మొబైల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీలు చెప్పడంతో వెంటనే ఇద్దరి అకౌంట్ నుండి డబ్బులకు కట్ అయ్యాయి. మొదటి సారి 51వేల 445, రెండవ సారి 51వేల 475 ఇలా విడతల వారీగా లక్షా, 85వేలు నగదు కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన దంపతులు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా ఓటిపి నెంబర్లు చెప్పాలని ఫోన్ చేస్తే.. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.