Site icon Prime9

Crime News : నిజామాబాద్ లో దారుణ ఘటన.. ప్రేమోన్మాది దాడిలో దళిత యువతి మృతి

Gang Rape attempt on 25 years young girl at agra

Gang Rape attempt on 25 years young girl at agra

Crime News : నిజామాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువతి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. గత కొంతకాలంగా బాధిత యువతి వెంట ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటపడుతున్నాడు. కాగా రెండ్రోజుల కిందట మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు.. సదరు యువతిని బెదిరించి కిడ్నాప్ చేసేందుకు యత్నించగా.. యువతి ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. దీంతో గాయపడిన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. నిందితుడుపై యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ దారుణ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జక్రాన్‌పల్లిలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన యువతిని.. ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గత కొంత కాలంగా ఆమె వెంటపడుతున్నా కానీ.. తన యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో ఉన్మాదిలా మారిపోయాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి యువకుడు మద్యంమత్తులో వుండగా యువతి ఒంటరిగా కనిపించింది. దీంతో ఉన్మాదిలా మారిపోయి ఆమెను బెదిరించి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ప్రతిఘటించిన యువతి తప్పించుకునేందుకు బైక్ పైనుండి దూకేసింది. దీంతో యువతిని వెంబడించి పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని అలాగే రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాలు నాయకులు, గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. యువతిపై దాడికి పాల్పడిన యువకున్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Exit mobile version