MLA Wife Suicide: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి నిన్న సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
దంపతుల మధ్య విబేధాలు ? (MLA Wife Suicide)
ప్రేమ వివాహం చేసుకున్న సత్యం-రూపాదేవి దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే రూపాదేవి గత రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని సమాచారం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిన్న ఉదయమే చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చినట్లు సమాచారం. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.