Stock Market: దేశీయ స్థాక్ మార్కెట్ దూసుకుపోయింది. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు..ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు లాభపడి 75,499.91 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేయగా నిఫ్టీ సైతం 369.85 పాయింట్ల లాభంతో 22,900 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,993.60 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనతో..( Stock Market)
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అంచనాలను మించి ఆర్బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడం సూచీల పరుగుకు కారణమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2.11 లక్షల కోట్లను ఆర్బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఈ మొత్తం కేంద్రం తన ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది.ఆర్బీఐ నుంచి లక్ష కోట్లు వస్తాయని మార్కెట్ ముందుగా అంచనా వేసింది. అంతకు డబుల్ డివిడెండ్ ఆర్బీఐ ప్రకటించడం విశేషం. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని కేంద్రం వినియోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.