Forbes Richest Womens: భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రతి రంగంలోనూ తమదైన మార్క్ కనపరుస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. అలాగే భారత సంతతి వ్యక్తులు సైతం తమ శక్తిసామర్థ్యాలను అంతర్జాతీయంగా ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి. అయితే తాజాగా, ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటుదక్కించుకోవడం విశేషం. స్వశక్తితో ఎదిగిన అమెరికా టాప్-100 సంపన్న మహిళల లిస్టులో భారత సంతతికి చెందిన ఇంద్రనూయి, జయశ్రీ ఉల్లాల్, నీరజా సేథీ, నేహా నార్ఖెడే ఉన్నారు.
అరిస్టా నెట్ వర్క్ కు ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్న 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్ ఫోర్బ్స్ జాబితాలో 15వ స్థానంలో నిలిచారు. ఉల్లాల్ నాయకత్వంలోని అరిస్టా నెట్ వర్క్ ట్రేడింగ్ కంపెనీ ఆదాయం గతేడాది 4.4 బిలియన్ డాలర్లు.
ఇక నీరజా సేథీ (68) ఫోర్బ్స్ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. ఆమె 1980లో సింటెల్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 2018లో ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈ 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నీరజా సేథీ మొత్తం నికర ఆస్తి విలువ 990 మిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది.
38 ఏళ్ల నేహా నార్ఖెడే విషయానికొస్తే… ఫోర్బ్స్ జాబితాలో 50వ స్థానం దక్కించుకున్నారు. ఆమె నికర ఆస్తి విలువ 520 మిలియన్ డాలర్లు. లింక్డ్ ఇన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఓపెన్ సోర్స్ మెసేజింగ్ వ్యవస్థ అపాచే కాఫ్కా రూపకల్పనలో పాలుపంచుకున్నారు.
ఇక, ఇంద్రనూయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెప్సీకో సంస్థ మాజీ సీఈవో. 67 ఏళ్ల ఇంద్రనూయి 2019లో పదవీవిరమణ చేశారు. అనంతరం ఆమెజాన్ తో జట్టుకట్టారు. తాజా ఫోర్బ్స్ జాబితాలో ఆమె ర్యాంకు 77. ఇంద్రనూయి నికర ఆస్తి విలువను ఫోర్బ్స్ 350 మిలియన్ డాలర్లుగా పేర్కొంది.
ఆరోసారి కూడా ఆమె(Forbes Richest Womens)
ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ సహ వ్యవస్థాపకురాలు డైనే హెండ్రిక్స్ వరుసగా ఆరో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు. 76 ఏళ్ల హెండ్రిక్స్ నికర ఆస్తి విలువ 15 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ వెల్లడించింది.