Supreme Court: అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిపుణుల కమిటీని సుప్రీం తిరస్కరించింది.
కమిటీని తామే నిర్ణయిస్తామని గత విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆరుగురు సభ్యులతో కమిటీ(Supreme Court)
ఈ కమిటీలో బ్యాంకింగ్ దిగ్గజాలు కేవీ కామత్, ఓపీ భట్ , ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్ లు ఉన్నారు.
మార్కెట్ నియంత్రణపై ప్రస్తుతం సెబీ కొనసాగుతోన్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి, స్టేటస్ రిపోర్టును సమర్పించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
పెట్టుబడి దారులకు రక్షణ కల్పించడం, వ్యవస్థలోని లోపాలను సరిచేయడం వంటి అంశాలపై ప్యానెల్ కీలక సూచనలు చేయనుంది.
కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరణ
కాగా, గతంలో ఈ వ్యవహారంలో కేంద్ర సీల్డ్ కవర్ లో పంపిన ప్రతిపాదలను సుప్రీం తిరస్కరించింది. సీల్ట్ కవర్ లో ఇచ్చిన ప్రతిపాదనలను అంగీకరించలేమని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ పారదర్శకత తో ఉండాలని కోరుకుంటున్నట్టు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ లో భారీగా అవకతవకలు జరిగాయంటూ అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ ఇచ్చిన నివేధిక తీవ్ర ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే.
సదరు నివేదికతో అదానీ సంస్థ షేర్లలో రక్తపాతమే జరిగింది. అదానీ ఆస్తుల విలువ కరిగిపోయింది. అయితే హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.
అదానీ గ్రూప్ ( Adani Group)పై జేపీసీ నియమించాలని ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
ఈ వ్యవహారతో మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి.
తాజాదా వాటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.